Greenfield Coastal Highway: మూలపేట నుంచి విశాఖకు.. గ్రీన్‌ఫీల్డ్ కోస్టల్ జాతీయ రహదారి
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:19 AM
Coastal road development సంతబొమ్మాళి మండలం మూలపేట నుంచి విశాఖ జిల్లా భీమిలి వరకు గ్రీన్‌ఫీల్డ్ కోస్టల్ జాతీయరహదారికి గ్రీన్‌సిగ్నల్ పడింది. మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి తీరప్రాంత జాతీయరహదారి ఆవశ్యకత వివరించడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

టెక్కలి, జూలై 5(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం మూలపేట నుంచి విశాఖ జిల్లా భీమిలి వరకు గ్రీన్‌ఫీల్డ్ కోస్టల్ జాతీయరహదారికి గ్రీన్‌సిగ్నల్ పడింది. మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి తీరప్రాంత జాతీయరహదారి ఆవశ్యకత వివరించడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ నుంచి భీమిలి వరకు ప్రస్తుతం జాతీయరహదారి సౌకర్యం కలిగివుంది. మరోవైపు భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోంది. దీంతో మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఆరు లేన్ల తీరప్రాంత జాతీయ రహదారి అవసరం ఏర్పడింది. అంతేకాకుండా పర్యావరణ ఇబ్బందులు లేని గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేగా ఉపయోగపడుతుంది. విశాఖ నుంచి మూలపేట పోర్టు వరకు తీరప్రాంత జాతీయరహదారి ఏర్పాటు చేస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి, మూలపేట పోర్టుకి కనెక్టివిటీ పెరుగుతుంది. తీరంలో పర్యాటకాభివృద్ధి చెందడంతోపాటు రిసార్ట్స్, ఆక్వా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు పుట్టుకొస్తాయి. తీరప్రాంతంలో కోస్టల్ జాతీయ రహదారికి సంబంధించి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎప్పటికప్పుడు చొరవ చూపుతూ కేంద్రం నుంచి అవసరమైన నిధులు విడుదలకు కృషి చేస్తున్నారు. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కోస్టల్ జాతీయరహదారి అవసరమని పలు సమావేశాల్లో పేర్కొన్నారు. సుమారు 200 కిలోమీటర్ల తీరప్రాంత జాతీయరహదారికి అవసరమైన ల్యాండ్‌ఎక్విజేషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా తనకు ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, వస్తే డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో జిరాయితీ, అటవీ, తీరప్రాంతం స్థలాలు ఏ మేరకు అవసరమో గుర్తిస్తామన్నారు.