Employes transfors: డబ్బులిస్తే.. సిఫారసు!
ABN , Publish Date - May 29 , 2025 | 12:16 AM
Recommendation Scam in transfers బదిలీల ప్రక్రియవేళ.. కొంతమంది ఉద్యోగులు అక్రమాలకు తెర తీస్తున్నారు. సిఫారసు లేఖలతో బదిలీల నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. జూన్ 2వ తేదీలోగా బదిలీల ప్రకియ ముగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.అయితే కొంతమంది ఉద్యోగులు.. ఏళ్లతరబడిగా ఒకే ప్రాంతంలో పాతుకుపోయిన వారికి బదిలీల అంశం కాస్త ఇబ్బందికరంగా మారింది.
బదిలీల నుంచి తప్పించుకునేందుకు కొందరు ఉద్యోగుల యత్నం
అసోసియేషన్ నుంచే నకిలీ లేఖలు
ఏళ్లతరబడిగా ఒకేచోట పాతుకుపోయేందుకు కుయుక్తులు
వైద్యఆరోగ్యశాఖలోనే అత్యధికం
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం
శ్రీకాకుళం, మే 28(ఆంధ్రజ్యోతి): బదిలీల ప్రక్రియవేళ.. కొంతమంది ఉద్యోగులు అక్రమాలకు తెర తీస్తున్నారు. సిఫారసు లేఖలతో బదిలీల నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. జూన్ 2వ తేదీలోగా బదిలీల ప్రకియ ముగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.అయితే కొంతమంది ఉద్యోగులు.. ఏళ్లతరబడిగా ఒకే ప్రాంతంలో పాతుకుపోయిన వారికి బదిలీల అంశం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఉపాధ్యాయుల బదిలీ మాదిరి.. ఇతర ఉద్యోగులకు కూడా ‘జనరల్ అడ్మినిస్ట్రేషన్’ డిపార్ట్‌మెంట్ కొన్ని నిబంధనలను జారీచేసింది. ప్రతీ ప్రభుత్వ శాఖ జిల్లాల వారీగా సిబ్బంది బదిలీ అంశాలకు సంబంధించి ఎటువంటి నియమాలు పాటించాలన్నదీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగ సంఘాల్లో ఆఫీస్ బేరర్స్‌కి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కానీ, యూనియన్లలో కీలక స్థానాల్లో ఉంటున్నవారు.. సభ్యత్వం.. వారి ఎన్నిక.. ఇతరత్రా వివరాలను స్పష్టంగా కలెక్టర్‌కు సమర్పించాలి. ఈ రీతిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రెజరీ.. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి మొదలైంది.
పాత తేదీలతో సిఫారసు లేఖలు
ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగులు ఈ బదిలీల్లోనూ కదలకుండా ఉండేందుకు, లేదా అదే ప్రాంతంలో కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌తో కాలపరిమితి ముగిసినా.. జిల్లా యూనియన్‌కు ఎన్నిక నిర్వహించలేదు. కొత్త కార్యవర్గం లేదు. కానీ.. ఉద్యోగుల బదిలీల సందడి ఆరంభం కావడంతో.. ఆ యూనియన్‌కు మొన్నటివరకు ప్రాతినిథ్యం వహించిన.. ఓ రిటైర్డ్ ఉద్యోగి అన్నీతానై చక్రం తిప్పేస్తున్నారు. పాత తేదీలతో యూనియన్ తరపున సిఫారసు లేఖలు ఇచ్చేస్తున్నారు. ఫలానా సంవత్సరం నుంచి యూనియన్‌లో కొనసాగుతూ.. ఫలానా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటూ.. సిఫారసు లేఖలో పేర్కొన్నారు. తద్వారా ఆ ఉద్యోగికి బదిలీ నుంచి మరో మూడేళ్లు మినహాయింపు కలిగేలా లేఖలు ఇచ్చేశారు. ఈ లేఖలు.. అదే యూనియన్‌లో ఇతర ఉద్యోగులకు చిక్కాయి. ఎన్నిక జరపకపోగా.. కాలం చెల్లిన యూనియన్‌లో పాత తేదీలతో ఓ రిటైర్డ్ ఉద్యోగి ముడుపులు తీసుకుంటూ ఆఫీస్ బేరర్‌లుగా సిఫారసు లేఖలు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉద్యోగ సంఘాల పరిధిలో14 తాలూకాలు ఉండగా.. వీటన్నింటిలో భారీగా డబ్బులు వసూలు చేసి వారికి లేఖలు ఇచ్చేశారు. ఓ మహిళా ఉద్యోగి 13 ఏళ్ల నుంచి ఒకే స్థానంలో కొనసాగుతుండగా.. ఆమెను ఆఫీస్ బేరర్ కింద పరిగణించి.. యూనియన్ ద్వారా ప్రాధాన్యమిచ్చి బదిలీ చేయవద్దని లేఖ సిద్ధం చేశారు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మిగిలిన ఉద్యోగులు, ఇప్పటికే సంఘ పూర్వప్రతినిధులపై మండిపడుతున్న సిబ్బంది.. ఆధారాలతో బదిలీల ప్రక్రియలో తెరవెనుక జరుగుతున్న తతంగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి వైద్యఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కువ మంది ఇటువంటి సిఫారసులు యూనియన్ నుంచి పొందినట్లు విశ్వసనీయ సమాచారం.
కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
ఈసారి ఉద్యోగ సంఘాల నుంచి అందే లేఖలు కలెక్టర్‌కు ఇవ్వాల్సి ఉన్నాయి. జిల్లావైద్య ఆరోగ్యశాఖతోపాటు.. ఇతర ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా యూనియన్ల బేరర్లుగా మినహాయింపు ఇవ్వాలనే లేఖలపై కలెక్టర్ మరింత దృష్టి సారించాలని కొంతమంది ఉద్యోగులు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసేవారు.. అలాగే ఇతర ప్రాంతాల నుంచి పదోన్నతిపై వచ్చినవారికి, యూనియన్‌లో లేకపోయినా.. పాత తేదీలతో సిఫారసు లేఖలు సంపాదించడం వల్ల.. అర్హులైన ఉద్యోగులు బదిలీ విషయంలో అన్యాయానికి గురువుతున్నారని కొందరు వాపోతున్నారు. రెండేళ్ల కిందట వైద్యఆరోగ్యశాఖకు సంబంధించి బదిలీ అంశంలో ఇటువంటి లేఖలే సిద్ధమయ్యాయి. ఇప్పుడు కూడా బదిలీ అంశం పారదర్శకంగా జరగాలంటే మొత్తం శాఖల వారీగా సిఫారసు లేఖలను కలెక్టర్ పరిశీలించాలని, అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.