Moharram: మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:12 AM
Shia Muslim tradition మొహర్రం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. దీన్ని శోకానికి.... సంతాపానికి గుర్తుగా పరిగణిస్తారు. ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలలో ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని స్మరించుకుంటారు.

నేడు జిల్లాలో నిర్వహణకు ఏర్పాట్లు
నరసన్నపేట, జూలై 5(ఆంధ్రజ్యోతి): మొహర్రం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. దీన్ని శోకానికి.... సంతాపానికి గుర్తుగా పరిగణిస్తారు. ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలలో ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని స్మరించుకుంటారు. మొహర్రం పదో రోజును ఆషురా అని పిలుస్తారు. ఇది కర్బలా యుద్ధంలో హుస్సేన్, అతని అనుచరుల మరణాన్ని స్మరించుకునే రోజు. మొహర్రం అనేది వాస్తవానికి పండుగ కాదు.
పది రోజుల పాటు...
సహాన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే మొహర్రం. ముస్లింలు భక్తి శ్రద్ధలతో దీనిని జరుపుకుంటారు. పది రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. హిజ్రీ శకం ప్రకారం మొహర్రంను మొదటి నెలగా పరిగణిస్తారు. చంద్రుడి కళల (నెలవంక) ఆధారంగా ఈ మాసానికి...దీనిలోని పదో రోజుకూ ప్రాధాన్యం ఏర్పడింది. మొహర్రం నెల పదో రోజున పీర్లను ఊరేగిస్తారు. ఈ సమయంలో హజ్రత్ ఇమాం హుస్సేన్‌కు గుర్తుగా పంజా (పీర్లు) ప్రతిమలను ఊరేగించి సంతాపం ప్రకటిస్తారు.
అప్పటి సంప్రదాయం
శత్రువుల చేతిలో 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులవుతారు. ఈ సందర్భంగా హజ్రత్ హుస్సేన్ తమ శత్రువుల తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వవద్దని అల్లాహోను ప్రార్థిస్తూ ప్రాణాలు విడుస్తారు. యుద్ధానంతరం యజీద్ తెగకు చెందిన వారు పశ్చాత్తాపం చెంది.. ‘దేవుడా మేం తప్పు చేశాం.. దైవ ప్రవక్త మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమార్చాం.. కాబట్టి మమ్మల్ని మన్నించమని గుండెల మీద చేతులతో బాదుకుంటా బిగ్గరగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు. అప్పటి నుంచి ప్రారంభమైన అగ్నిగుండం మీద నడిచే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
మన జిల్లాలో ఇలా...
శ్రీకాకుళం నగరంలోని జెండా వీధిలో ఆదివారం రాత్రి (మొహర్రం) అగ్ని గుండాల మీద ముస్లింలు నడుస్తారు. జలుమూరు మండలం కూర్మనాథపురం గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా హిందువులే ఈ పండుగను ఎంతో పవిత్రంగా చేస్తారు. ఇచ్ఛాపురం వద్ద పీర్ల కొండపై కూడా మొహర్రం పండుగ జరుపుకుంటారు. మొహర్రం సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.