అదృశ్యమైన మహిళ.. శవమై తేలింది
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:43 PM
Elderly woman murdered in Murapaka మురపాకలో వడ్డి పార్వతి (64) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. పార్వతి ఈ నెల 1న పశువులను మేత కోసం ఊరిబయట పొలాల వద్దకు తీసుకెళ్లింది. ఆ రోజు సాయంత్రం ఆమె ఇంటికి చేరుకోలేదు. పెద్దకుమారుడు లక్ష్మణరావుతోపాటు కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు.
మురపాకలో వృద్ధురాలి హత్య
నిందితుల కోసం పోలీసుల గాలింపు
లావేరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మురపాకలో వడ్డి పార్వతి (64) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. పార్వతి ఈ నెల 1న పశువులను మేత కోసం ఊరిబయట పొలాల వద్దకు తీసుకెళ్లింది. ఆ రోజు సాయంత్రం ఆమె ఇంటికి చేరుకోలేదు. పెద్దకుమారుడు లక్ష్మణరావుతోపాటు కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. మంగళవారం తన తల్లి పార్వతి కనిపించడం లేదంటూ లక్ష్మణరావు లావేరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం లావేరు, రణస్థలం ఎస్‌ఐలు కొండపల్లి అప్పలసూరి, ఎస్ చిరంజీవి సిబ్బందితోపాటు క్లూస్‌టీం, డాగ్ స్క్వేడ్ సహాయంతో వెతక సాగారు. అయినా ఆమె జాడ కానరాలేదు. బుధవారం గొల్లబడి సమీపాన పంట పొలాల్లోని పాడైన బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ఇది హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఆమె చెవి, ముక్కులకు ధరించిన సుమారు 2 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించేందుకు ఎవరో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు. పార్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లావేరు ఎస్‌ఐ అప్పలసూరి తెలిపారు. దీనిపై ఇన్‌చార్జి సీఐ సత్యనారాయణ(ఆమదాలవలస) పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా నిందితుల కోసం లావేరు, రణస్థలం ఎస్‌ఐలతోపాటు జేఆర్‌పురం సర్కిల్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హత్య జరిగిన సమీప ప్రాంతంలోని ఓ కొబ్బరితోటలో సోమవారం పేకాట ఆడినవారితోపాటు గంజాయి బ్యాచ్‌ను కూడా పట్టుకుని విచారణ చేస్తున్నారు.