Share News

పంచాయతీల్లో నిధుల స్వాహా

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:17 AM

Robbery with fake bills జిల్లాలోని పలు పంచాయతీల్లో నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ‘స్వర్ణ పంచాయతీ యాప్‌’ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు, ప్రజలు చెల్లించే పన్నులతోపాటు ప్రతి పైసాకు జమా ఖర్చులు పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది. కానీ కొన్ని పంచాయతీల్లో ఈ యాప్‌లోను తప్పుడు బిల్లులు అప్‌లోడ్‌ చేస్తూ.. నిధులు కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

పంచాయతీల్లో నిధుల స్వాహా
నరసన్నపేట పంచాయతీ కార్యాలయం

  • దొంగ బిల్లులతో దోపిడీ

  • అరకొరగా పారిశుధ్య నిర్వహణ

  • కానరాని అభివృద్ధి పనులు

  • పూర్తిస్థాయిలో వినియోగించని స్వర్ణ పంచాయతీ యాప్‌

  • నరసన్నపేట, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి):

  • నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో సుమారు రూ.3లక్షలు విలువ చేసే బ్లీచింగ్‌ కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి రూ.లక్ష బ్లీచింగ్‌ మాత్రమే కొనుగోలు చేశారు. బ్లీచింగ్‌ విక్రయించే వ్యాపారితో మిలాఖత్‌ అయి దొంగ బిల్లులతో సమారు రూ.2లక్షలను పక్కకు వేసి.. సిబ్బంది జీతాల బిల్లులు కోసం డీపీవో కార్యాలయానికి ముడుపు కట్టారని బహిరంగంగా పాలకమండలి సభ్యులే చెబుతున్నారు.

  • జిల్లాలోని ఒక పంచాయతీలో ఇటీవల రూ.8లక్షల మేర పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. క్షేత్రస్థాయిలో మాత్రం రూ.6లక్షల విలువైన పనులు మాత్రమే జరిగాయి. అధికారులు, పాలకవర్గం సభ్యులు కుమ్మక్కై నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిధులు వినియోగం పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం ‘స్వర్ణ పంచాయతీ యాప్‌’ను అందుబాటులోకి తెచ్చినా.. జిల్లాలోని చాలా పంచాయతీల్లో అక్రమాలు ఆగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • జిల్లాలోని పలు పంచాయతీల్లో నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ‘స్వర్ణ పంచాయతీ యాప్‌’ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు, ప్రజలు చెల్లించే పన్నులతోపాటు ప్రతి పైసాకు జమా ఖర్చులు పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది. కానీ కొన్ని పంచాయతీల్లో ఈ యాప్‌లోను తప్పుడు బిల్లులు అప్‌లోడ్‌ చేస్తూ.. నిధులు కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీ నిధులతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లులను కొందరు సర్పంచ్‌లు పంచాయతీ కార్యదర్శిలతో కలిసి బుక్కేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పనులు చేయకపోయినా అధికారులను బురిడీ కొట్టిస్తూ బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం రెండో విడత 912 పంచాయతీలకు రూ.32.15 కోట్లు విడుదల చేసింది. వీటిపై కొందరు పంచాయతీ పాలకవర్గం సభ్యులు కన్ను పడింది. పంచాయతీ నిఽధులతో పాటు ఆర్ధిక సంఘ నిధులను పక్కదోవ పట్టిస్తున్నారణే ఆరోపణలున్నాయి. మరోవైపు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులు సక్రమంగా జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • స్వర్ణ పంచాయతీ యాప్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండానే పన్నులన్నీ డిజిటల్‌ రూపంలో చెల్లించవచ్చు. ఇంటి పన్నులు, బాకీలను డిజటల్‌ రూపంలో చెల్లిస్తే నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి జమవుతుంది. పంచాయతీలు ఖర్చు చేసే ప్రతి పైసా వివరాలు పారదర్శకంగా ఉంటాయి. దొంగ బిల్లుల చెల్లింపులు అరికట్టవచ్చు. పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. కానీ జిల్లాలో ఈ యాప్‌ నామమాత్రంగా వినియోగించి ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీలో పాలన గాడిన పెట్టాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:17 AM