Minister Lokesh Support : జవాన్ కుటుంబానికి మంత్రి లోకేశ్ భరోసా
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:19 PM
Soldier’s Family Help భూ సమస్య పరిష్కారంలో భాగంగా జవాన్ కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ద్వారా భరోసా ఇచ్చారు.
- భూ సమస్య పరిష్కారంలో అండగా ఉంటామని స్పష్టం
కోటబొమ్మాళి, జూలై 1(ఆంధ్రజ్యోతి): భూ సమస్య పరిష్కారంలో భాగంగా జవాన్ కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ద్వారా భరోసా ఇచ్చారు. కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ రొక్కం అశోక్‌కుమార్ జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామంలో ఉన్న తన భూమి ఆక్రమణకు గురైందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. ‘చిన్నసాన గ్రామానికి చెందిన రొక్కం కరుణాకర్, రొక్కం వరప్రసాద్.. స్థానిక వైసీపీ నేతల అండతో దౌర్జన్యంగా మా భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రశ్నించిన మా తల్లిదండ్రులు రొక్కం శివాజీ, సుగుణమ్మను బెదిరించి భయబ్రాంతులకు గురి చేశారు. నేను విధి నిర్వహణలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఉంటున్నాను. నా కుటుంబానికి అండగా ఉండి, మా భూములను మాకు ఇప్పించాల’ని జవాన్ అశోక్ కుమార్ కోరారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. ‘దేశం కోసం మీరు చేసిన సేవకు, త్యాగానికి సెల్యూట్. మీ తల్లిదండ్రులకు రక్షణ కల్పించి, అండగా ఉంటాం. మీ గ్రామానికి అధికారులను పంపించి మీ కుటుంబానికి న్యాయం చేస్తా’నని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు జవాన్ అశోక్‌కుమార్ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అండగా ఉంటామని, అన్నివిధాలా భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఆర్‌ఐ పవిత్ర, వీఆర్వో అఖిల్ సోమవారం రాత్రి జవాన్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి ఫిర్యాదును రికార్డు చేసి.. ఉన్నతాధికారులకు అందజేశారు. మంగళవారం ఎస్‌ఐ సత్యనారాయణ కూడా సిబ్బందితో గ్రామానికి వెళ్లి సంబంధిత పొలాన్ని పరిశీలించారు.