Overdose of medicine: చంపేస్తున్నారు!
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:37 PM
Overdose of medicine at PMP and RMP జిల్లాలోని చాలా గ్రామాల్లో కొంతమంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో హీరో మాదిరి.. తమకు వైద్యం గురించి పూర్తిగా తెలియకపోయినా డాక్టర్ల అవతారమెత్తుతున్నారు.
రోగుల ప్రాణాలతో చెలగాటం
పీఎంపీ, ఆర్‌ఎంపీల వద్దే అన్నీ..
మోతాదుకు మించి వైద్యం
చోద్యం చూస్తున్న అధికారులు
నరసన్నపేట, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి):
గత నెలలో జలుమూరు మండలం కూర్మనాథపురానికి చెందిన ఒక రైతు ఒక్కసారిగా కళ్లు తిరిగి మూర్చపోయాడు. కుటుంబ సభ్యులు నరసన్నపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స అందజేయగా.. ఓవర్‌డోస్ మందులు ఇవ్వడంతో కిడ్నీ మీద ప్రభావం పడి సోడియం లెవెల్స్ పెరిగాయి. దీంతో ఆ రైతును శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ 15 రోజులపాటు చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇటీవల గుంటూరు జిల్లా తూరకపాలెంలో వరుస మరణాలు సంభవించాయి. గ్రామంలో జ్వరాల బారిన పడినవారికి ఆర్‌ఎంపీ వైద్యుడు కల్తీ సిలైన్ ఎక్కించడంతోనే పలువురు మృతి చెందినట్టు వైద్యపరిశోధకులు నిర్ధారించారు.
తాజాగా గురువారం భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన తేజాలమ్మ తన భర్త సూర్యనారాయణతో కలిసి కొత్తూరులో పీఎంపీ నాగేశ్వరరావు నిర్వహిస్తున్న ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లింది. కాళ్లు పీకులు, నొప్పులుగా ఉన్నాయని చెప్పింది. నాగేశ్వరరావుకు ఆమెకు ఇంజక్షన్ ఇవ్వగా డోస్ ఎక్కువై.. భర్త కళ్లముందే ప్రాణాలు కోల్పోయింది.
నరసన్నపేట పట్టణంలో ఓ వ్యక్తి.. ఎటువంటి వైద్యవిద్య చదవలేదు. కానీ విరిగిన కాళ్లు, చేతులకు చికిత్స చేస్తున్నారు. కొంతమందికి నయమవుతుంది. కానీ చాలామంది ఆయన వైద్యం కారణంగా అంగవైకల్యం బారిన పడ్డారు.
కొన్ని రోజుల కిందట సారవకోట మండలం ఒక గ్రామంలో ఓ వ్యక్తి ఆయాసంతోపాటు చెమట పడుతుందోందని ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆయన సెలైన్ బాటిన్ పెట్టి.. చికిత్స అందజేశాడు. ఆ వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని, కొంచెం ఆలస్యమైతే చనిపోయేవాడని వైద్యులు తెలిపారు.
..ఇలా జిల్లాలోని చాలా గ్రామాల్లో కొంతమంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో హీరో మాదిరి.. తమకు వైద్యం గురించి పూర్తిగా తెలియకపోయినా డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. మందులివ్వడమే కాదు.. ఆపరేషన్లు సైతం చేసేస్తున్నారు. పట్టణాల్లో పెద్దాసుపత్రికి వెళితే ఖర్చు భరించలేమన్న కారణంతో చాలామంది పేదలు మెకాళ్లు , కీళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడుతూ.. గ్రామాల్లో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు ఆర్‌ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా వైద్యం చేస్తున్నారు. ప్రథమ చికిత్స అందించాల్సిన వీరు ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందజేస్తున్నారు. కొన్నిచోట్ల క్లినిక్, మందుల దుకాణం.. అన్నీ ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. ఇంకొందరు అనుమతులు లేకుండానే మందులషాపులు, ల్యాబ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ఇష్టాను సారంగా రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. మరి కొందరైతే మెడికల్ దుకాణాల్లోనే అన్ని రకాల వైద్య చికిత్సలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు ఇలా..
నిబంధనల మేరకు ఆర్‌ఎంపీలు ప్రథమచికిత్స మాత్రమే చేయాలి. ఎలాంటి ఇంజక్షన్లు ఇవ్వకూడదు. ఎవరైనా జ్వరంతో బాధపడుతూ వస్తే సాధారణ మాత్రలే ఇవ్వాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే సమీపంలోనే ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సిఫారసు చేయాలి. కానీ కొందరు ఆర్‌ఎంపీలు తమ పరిధి దాటి చికిత్సలు చేస్తున్నారు. ప్రతీ సమస్యకు ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్, స్థిరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. కొన్నిరకాల ఫెయిన్ కిల్లర్లు ఇస్తున్నారు. వీటివల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతోంది. కొంతమంది రోగులకు కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి.
గర్భిణులు, చిన్న పిల్లలకు ఎలాంటి చికిత్స చేయకూడదు. ఫార్మసీ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకుని మందుల దుకాణాలు నిర్వహించడం కూడా నిబంధనకు విరుద్ధమే. ఇలాంటివాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలోని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో డమ్మీ చేతి సంచి డాక్టర్ల వ్యవహారంతో చాలామంది ప్రాణాలు పైకిపోతున్నాయి. ఆర్‌ఎంపీలు చేసే ఇంజక్షన్లు వికటించిన సందర్భాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. మోతాదుకు మించి మందులు ఇవ్వడంతో కొంతమంది అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆర్‌ఎంపీలు, పీఎంపీలు రోగులకు ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించరాదు. వారి వద్దకు వచ్చే రోగులకు ప్రథమచికిత్స అందజేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేయాలి. శస్త్రచికిత్సలు, కీళ్లు విరిగితే కట్లు వేయడం చేయరాదు. ఇలాంటి వారిపై ఫిర్యాదులు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
- డా.అనిత, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అఽదికారిణి, శ్రీకాకుళం