Share News

Road works : కరిగిన నిఽధులు.. చెదిరిన దారులు!

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:46 PM

Unfinished roads in tribal villages కొండపై గిరిజన ప్రాంత గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తప్పడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రహదారి పనులను వదిలేసింది. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రేషన్‌ సరుకులు, వైద్యసేవలు కోసం కొండపై నుంచి నడిచి కిందకు వచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

Road works : కరిగిన నిఽధులు.. చెదిరిన దారులు!
ఇటీవల వర్షానికి కొట్టుకుపోయిన గూడ గ్రామ రహదారి

  • కొండపై గిరిజన గ్రామాల్లో పూర్తికాని రోడ్లు

  • ఏటా మెటల్‌, పిండిరాయి వేసి వదిలేస్తున్నారు

  • వర్షాకాలంలో కొట్టుకుపోతున్న వైనం

  • పనులు పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం ఆదేశం

  • మెళియాపుట్టి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలంలో కొండపై ఉన్న కేరాశింగి నుంచి గూడ గ్రామానికి సుమారు 2.50 కిలోమీటర్లు దూరం. ఈ మార్గంలో రహదారి పనులకు రూ.1.50 కోట్లు గతంలో మంజూరయ్యాయి. వైసీపీ ప్రభుత్వ పాలనలో కొంతమేర మట్టి పనులు చేసి.. మీద మెటల్‌, రాయి పిండి వేసి వదిలేశారు. బిల్లులు జరిగినా పనులు పూర్తికాలేదు. తరచూ పడుతున్న వర్షాలకు రోడ్డుపై వేసిన మెటల్‌తోపాటు రాయిపిండి కొట్టుకుపోతోంది. దీంతో రహదారి పనులు మళ్లీ మొదటికి వచ్చాయి. నిధులు చాలక మళ్లీ రూ.92లక్షలు మంజూరు చేశారు. కానీ ప్రస్తుతం రాయిపిండి వేసి వదిలేశారు. నిధులు ఖర్చు చేస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఏటా వర్షాలకు మెటల్‌, రాయిపిండి కొట్టుకుపోతోందని పేర్కొంటున్నారు. మళ్లీ వేసవిలో రాయిపిండి వేసి బిల్లులు చేసుకుంటున్నారు కానీ సీసీ రోడ్డు మాత్రం నిర్మించడం లేదని వాపోతున్నారు.

  • మెళియాపుట్టి మండలం ముఖందుపురం నుంచి కేరాశింగి గ్రామానికి 2017 నుంచి రహదారి పనులు జరుగుతున్నా, ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఈ రహదారికి మొదట్లో మట్టి పనులకు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. మళ్లీ 2019లో వైసీపీ ప్రభుత్వం 3.60 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.11 కోట్లు మంజూరు చేసింది. కొంతమేరకు పనులు చేసి వదిలేసింది. మళ్లీ 2023లో 2.40 కిలోమీటర్ల సీసీ రోడ్డుకు రూ.1.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. కానీ పనులు పూర్తికాకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

  • ఒక్క మెళియాపుట్టి మండలానికే 57 పనులకు సంబంధించి రూ.23.48 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే కొంతమంది పాతరోడ్లను యంత్రాలతో తవ్వేశారు. మరికొంతమంది మెటల్‌ రాళ్లు వేసి వదిలేశారు. దీంతో గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ప్రతీ రెండు వారాలకు ఒకసారి పనులపై సమీక్షించాలని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

  • కొండపై గిరిజన ప్రాంత గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తప్పడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రహదారి పనులను వదిలేసింది. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రేషన్‌ సరుకులు, వైద్యసేవలు కోసం కొండపై నుంచి నడిచి కిందకు వచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వైద్యసేవలు అత్యవసరమైతే డోలీ మోతతో కిందకు దింపుతున్నారు. డోలీ మోతలు లేని గ్రామాలు చూడాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై దృష్టి సారించింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 145 గ్రామాలకు సరైన రహదారులు లేవని అధికారులు గుర్తించారు. తొలివిడతగా 72 గ్రామాలకు రూ.52.92 కోట్లు నిధులు మంజూరు చేశారు. కాగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షిస్తున్నా ఫలితం లేకపోతోంది. మెళియాపుట్టి మండలంలో అడ్డివాడ గ్రామానికి మాత్రమే పనులు పూర్తిచేశారు. ఇంకా కేరాశింగి, గూడ, చందనగిరి, కుడ్డబ గ్రామాల్లో పనులు పూర్తికాలేదు. కొంతమేర పనులు చేసినా సకాలంలో బిల్లులు కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొండపై గిరిజన గ్రామాలకు రహదారులు పూర్తిచేయాలని ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కొండలపై రహదారి పనులు మళ్లీ సంక్రాంతి తర్వాతే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా.. మెటల్‌, రాయిపిండి వేసి వదిలేస్తుండడంతో వర్షాల సమయంలో రహదారులు కొట్టుకుపోతున్నాయని, నిధులు వృథా అవుతున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

  • ఇంజనీరింగ్‌ శాఖలో కదిలిక వచ్చేనా?

  • సీతంపేట ఐటీడీఏ ఇంజనీరింగ్‌ శాఖలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రహదారుల పనులు పూర్తికావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బంధువుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారనే కారణంతో గతంలో పాతపట్నం సెక్షన్‌ ఏఈ శ్రీకాంత్‌ సస్పెన్షన్‌ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఐటీడీఏ ఈఎన్‌సీ శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. సీతంపేటలో ఇద్దరు ఈఈలు కేవీఎస్‌ఎన్‌ కుమార్‌, రమాదేవి విధులు నిర్వహిస్తున్నారు. రమాదేవికి ఇటీవల నెల్లూరు ఐటీడీఏకు బదిలీ చేశారు. ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బదిలీ నిలిపేశారు. అప్పటికే ప్రభుత్వం విజయవాడ ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న కుమార్‌ను సీతంపేట ఈఈగా నియమించింది. దీంతో ఇక్కడ ఇద్దరు ఈఈలు విధులు నిర్వహిస్తుండగా, వారి మధ్య అంతర్గత కుమ్ములాటతో ఓ వైపు సిబ్బంది నలిగిపోతున్నారు. మరోవైపు పనులు ముందుకు సాగడం లేదు. కొంతమంది అధికారపార్టీ నాయకులు ఇంజనీరింగ్‌శాఖ అధికారులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటికే రూ.20.36 కోట్ల నిధులతో 16 రోడ్ల పనులను ఐటీడీఏ శాఖ నుంచి పంచాయతీరాజ్‌ శాఖకు కలెక్టర్‌ బదలాయించారు. మిగిలిన పనులైనా ఎంతవరకు చేస్తారో వేచిచూడాలి.

  • కష్టాలు తప్పడం లేదు

  • 15 ఏళ్లుగా రోడ్డు పనులు జరుగుతున్నా నేటికీ పూర్తికావడం లేదు. ఏటా వేసవిలో రాయి పిండివేసి వదిలేస్తున్నారు. వర్షాలు పడుతున్నప్పుడు కొట్టుకుపోయి.. మళ్లీ గోతులుగా మారుతున్నాయి. నిధులు ఖర్చు చేసినా పనులు పూర్తికాక కష్టాలు తప్పడం లేదు.

    - పి.ఆనందరావు, కేరాశింగి

  • అనారోగ్యం వస్తే భయం

  • మా కొండపై గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే భయం వేస్తోంది. రోడ్డు పనులు జరిగితే ముందుగా వైద్యసేవలు అందుతాయని ఆశ పడుతున్నాం.

    - సవర.లక్ష్మమ్మ, కేరాశింగి

  • పనులు చేపడతాం

  • ఇటీవల బదిలీపై వచ్చాను. పూర్తిగా పనులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాను. చేసిన పనులకు సంబంధించి బిల్లుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతాం.

    - కేవీఎస్‌ఎన్‌ కుమార్‌, ఈఈ, సీతంపేట


kerasingi.gif

Updated Date - Aug 16 , 2025 | 11:46 PM