Share News

పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:46 PM

collecter review జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీని నియంత్రించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణకు చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అరసవల్లి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీని నియంత్రించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి పర్వదినాల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నందున క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్‌ నిర్వహణ విషయంలో ఎక్కడా లోటు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలి. జిల్లాలో మతపరమైన, లౌకిక కార్యక్రమాలతోపాటు శివాలయాలు, నదీ తీరాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా రక్షణ కల్పించాలి. ఆలయాలు, పుణ్యస్నానాల ఘాట్ల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌ల పూర్తి జాబితాను, ఫోన్‌ నెంబర్లతో సహా తయారు చేసి అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలి. పుణ్యస్నానాలు, దీపారాధనలు చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు, ఆలయ కార్యనిర్వహణాధికారులు, స్థానిక సంస్థలు సమన్వయంతో పని చేయాల’ని ఆదేశించారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పారిశుధ్య నిర్వహణ, శాంతిభద్రతలు, ప్రభుత్వ పథకాలు అమలుపై కలెక్టర్‌ సమీక్షించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌వీ లక్ష్మణమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

నేడు జిల్లా సమీక్షా సమావేశం

జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10గంటలకు రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్‌, ప్రవాస భారతీయుల సాధికారిత సంబంధాలశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తామన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:46 PM