భోజన పథకం మెనూ చార్జీలు పెంచాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:38 PM
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి డిమాండ్ చేశారు.
అరసవల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా 6వ మహాసభ బుధవారం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిడ్డేమీల్ పథకంలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.10 వేలు అందించాలన్నారు. ప్రమాదబీమా, పదవీ విరమణ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వంట షెడ్లు, వంట పాత్రలు, తాగునీరు, గ్యాస్ సరఫరా తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు. రానున్న రోజుల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ రమణ, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి, కె.సుశీల తదితరులు పాల్గొన్నారు.