Palasa development: పలాస అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:44 PM
Master plan Infrastructure projects పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా మునిసిపాలిటీలో మార్పులు
కొత్తగా 21 రెవెన్యూ గ్రామాలు చేరిక
గెజిట్ నోటిఫికేషన్‌పై అభిప్రాయాల స్వీకరణ
పలాస, జూలై 26(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీని సుడా(శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ) పరిధిలోకి తీసుకువచ్చి 2046 సంవత్సరం వరకూ అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఇటీవల గెజిట్ నోటీఫికేషన్ విడుదల చేశారు. 30 రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు గడువు విధించారు. అనంతరం మాస్టర్‌ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పలాస-కాశీబుగ్గను పూర్తిస్థాయిలో పట్టణీకరించేందుకు ఈ మాస్టర్‌ప్లాన్ ఎంతో దోహదం చేస్తుంది.
ప్రస్తుతం పలాస-కాశీబుగ్గ పరిధిలో మొత్తం 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్‌లో కొత్తగా 21 రెవెన్యూ గ్రామాలను చేర్పించారు. అందులో కైజోల, సున్నాడ, శాసనం, రాజగోపాలపురం, కంబిరిగాం, ఈదురాపల్లి, కేదారిపురం, సొగిడియా, పండాశాసనం, బ్రాహ్మణతర్లా, అనంతగిరి, కిష్టుపురం, లక్ష్మిపురం, గరుడఖండి, బట్టుపాడు, మహదేవపురం, గోపాలపురం, నగరంపల్లి, పెద్దబడాం, రాజాం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో మాస్టర్‌ప్లాన్ కింద వస్తాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి సుడా పట్టణాభివృద్ధిలోకి తీసుకురానున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా 20, 40 అడుగుల వెడల్పుతో రహదారులు నిర్మాణం జరగనున్నాయి. మొత్తం ఈ ప్రాంతాలన్నీ జోన్లవారిగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లు, పారిశ్రామికవాడలు, కమర్షియల్ ప్రాంతాలు, అగ్రికల్చర్ జోన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు, పెట్రోలు బంకులు మొత్తం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. పథకమంతా జాతీయరహదారికి అనుసంధానం చేసి గ్రామాలు, పట్టణాభివృద్ధి జరిపేందుకు పొందిపరిచారు. ఇప్పటికే పలాస-కాశీబుగ్గ.. జీడి పారిశ్రామికవాడగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన విషయం విధితమే. మన జీడిపప్పుకు జాతీయస్థాయి అవార్డు కూడా లభించింది. ఈ నేపఽథ్యంలో మాస్టర్‌ప్లాన్ భవిష్యత్ అవసరాలకు అమలైతే జిల్లాకేంద్రం తరువాత ఆ స్థాయిలో జంట పట్టణాలు సుందరీకరణకు అవకాశం ఉంటుందని జంట పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి అవసరం
భవిష్యత్ అవసరాలకు పలాస-కాశీబుగ్గ అభివృద్ధి చేయడం ఎంతో అవసరం ఉంది. శరవేగంతో పట్టణీకరణ జరుగుతున్న సమయంలో మాస్టర్‌ప్లాన్ అమలైతే విశాలమైన రహదారులు, ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి జరుగుతుంది. దీనికి సంబంధించి ముసాయిదా ఇప్పటికే విడుదల చేశాం. ప్రజల అభ్యంతరాలు స్వీకరించి దానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తాం.
- ఎన్.రామారావు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ