పోర్టు కళింగపట్నంలో భారీ చోరీ
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:55 PM
Theft of gold ornaments worth 59 tolas గార మండలం పోర్టు కళింగపట్నంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. మూడిళ్లలో సుమారు 59 తులాల బంగారం ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరణకు గురైంది.
59 తులాల బంగారు అభరణాలు అపహరణ
క్లూస్ టీమ్‌తో నిందితుల వివరాలు సేకరణ.
గార రూరల్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గార మండలం పోర్టు కళింగపట్నంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. మూడిళ్లలో సుమారు 59 తులాల బంగారం ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరణకు గురైంది. ఇందుకు సంబంధించి బాధితులు, గార పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోర్టు కళింగపట్నానికి చెందిన మైళపిల్లి శంకర దాస్‌కు చెందిన మూడు ఇళ్లల్లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. శంకరదాస్‌కు చెందిన ఒక ఇంట్లో ఆయన మేనల్లుడు పప్పు దీపక్(వైజాగ్), మరో ఇంట్లో ఆయన తల్లి పోలమ్మ, ఇంకో ఇంట్లో చెల్లి పద్మావతి నివాసం ఉంటున్నారు. శంకర్‌దాస్ శ్రీకాకుళంలో నివసిస్తున్నారు. పప్పు దీపక్ సీమెన్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా విధుల్లో చేరేందుకు ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి విశాఖపట్నం వెళ్లిపోయారు. శంకర్‌దాస్ తల్లి పోలమ్మ అనారోగ్యం కారణంగా కొన్నాళ్లుగా శ్రీకాకుళంలోని ఆయనే వద్ద ఉంటున్నారు. ఆ రెండిళ్లలో ఎవరూ లేకపోవడంతో.. చివరింట్లో ఒంటరిగా ఉండలేక పద్మావతి కూడా ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి.. గ్రామంలో వేరే దగ్గర నివసిస్తున్న తన అక్క ఇంటికి వెళ్లిపోయింది. ఆమె సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా.. గేటు తాళాలతోపాటు మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని ఫోన్‌లో తన అన్న శంకర్‌దాస్‌కు తెలియజేసింది. ఆయన వచ్చి చూడగా బంగారు ఆభరణాలు పోయినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గార ఎస్‌ఐ గంగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏయే వస్తువులు, నగదు పోయాయో ఆరా తీశారు. తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.లక్ష నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు పద్మావతి తెలిపారు. అలాగే తన తల్లి ఇంట్లో 15 తులాల బంగారం, దీపక్ ఇంట్లో మరో 4 తులాల బంగారం చోరీకి గురైందని శంకర్‌దాస్ వివరించారు.
శ్రీకాకుళం నుంచి క్లూస్‌టీమ్ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పరిసర ప్రాంతాలను పరిశీలించి.. వేలిముద్రలు సేకరించింది. ఏ వైపు నుంచి దుండగులు చొరబడ్డారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచారు. కాగా.. ప్రధాన రహదారిలోని మూడు ఇళ్లలో ఒకేసారి పెద్దఎత్తున చోరీ జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని పేర్కొంటున్నారు.