పాతపట్నంలో వివాహిత..
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:43 PM
స్థానిక ప్రశాంతినగర్‌లో నివాస ముంటున్న దీపిక కుమారి అలియాస్ సీతాదేవి చౌదరి(23) అనే వివాహిత ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.
పాతపట్నం ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రశాంతినగర్‌లో నివాస ముంటున్న దీపిక కుమారి అలియాస్ సీతాదేవి చౌదరి(23) అనే వివాహిత ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. దీపిక భర్త హీరారామ్ స్థానికంగా హార్డ్‌వేర్ వ్యాపారం చేస్తున్నాడు. రాజస్థాన్ చెందిన వీరికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రశాంతి నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరితో పాటు హీరారామ్ సోదరుడు, బావ, మామయ్య కూడా అదే ఇంట్లో ఉంటూ హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తున్నారు. దీపిక రాజస్థాన్ నుంచి నెలరోజుల కిందటే ఇక్కడకి వచ్చింది. కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లిపోతుండడంతో ఇంట్లో ఒక్కరే ఉంటుంది. ఆమెకు తెలుగురాకపోవడంతో స్థానికంగా ఎవరితో మాట్లాడే అవకాశాలు లేకపోతున్నాయి. ఈ నెల 25న మధ్యాహ్నం ఎవరో బయట నుంచి ఇంటి తలుపు కొట్టడంతో భయపడి భర్తకు ఫోన్ చేసింది. దీంతో భర్త వచ్చి తలుపు కొట్టగా.. ఎవరో అనుకుని ఆమె తలుపులు తీస్తూ బాత్‌రూం క్లీనింగ్ ద్రావణాన్ని ఒక్కసారిగా విసిరింది. ఆ ద్రావణం హీరారామ్ కళ్లలోకి పడింది. దీంతో హీరారామ్ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి చూపించగా కంటి చూపునకు ఇబ్బందికలిగేలా ఉందని వైద్యులు చెప్పారు. దీంతో భర్త తరఫు కుటుంబ సభ్యులు ఏమైనా అంటారేమోనని దీపిక భయపడి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన పడకగదిలో సీలింగ్ ఫ్యాన్‌కి చీరకట్టుకొని ఉరివేసుకుంది. షాపు నుంచి ఇంటికి వచ్చిన ఆమె మరిది దీపికను చూసి కిందకు దించాడు. అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బి.లావణ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు ఆమె సమాచారమివ్వగా టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భర్త హీరారామ్ ఇచ్చిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇది బలవన్మర ణమా? లేదా ఇతరత్రా కారణాలు ఉన్నాయా అన్న సందేహాలను పోలీసులు సైతం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.