Share News

Marriges decaration: నాటి సందడి లేదు మరి!

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:41 AM

no more celebrations శ్రావణమాసం వేళ.. జిల్లాలో జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. వేలాది జంటలు ఒక్కటవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వేడుకల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Marriges decaration: నాటి సందడి లేదు మరి!

ఖర్చు పెరిగింది.. ఆ వేడుకల్లేవు

గతంలో మూడు రోజుల పెళ్లి

చెట్టు కొమ్మలతో వివాహ వేదిక

అంతా సాంప్రదాయబద్ధంగానే..

ఇప్పుడేమో అంతా ఈవెంట్‌లాగా..

గంటల్లోనే ముగుస్తున్న తంతు

రణస్థలం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం వేళ.. జిల్లాలో జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. వేలాది జంటలు ఒక్కటవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వేడుకల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మూడు రోజుల పెళ్లి ముచ్చటైన పెళ్లి అన్నట్టు ఉండేది. మూడు రోజులు ముందుగానే వివాహ వేడుకల సన్నాహాలు ప్రారంభమయ్యేవి. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడేది. కానీ ప్రస్తుతం తక్కువ సమయంలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. నూతన పోకడలతో ఖర్చు భారీగా పెరిగినా.. నాటి సందడి మాత్రం కనిపించడం లేదని కొంతమంది పెద్దలు పేర్కొంటున్నారు.

చలువ పందిళ్ల స్థానంలో స్టేజీలు..

గతంలో కొబ్బరికమ్మలు, పచ్చని చెట్టుకొమ్మలతో పెళ్లి పందిరి ఏర్పాటు చేసేవారు. ఆవు పేడతో అలికిన మండపం సిద్ధం చేసేవారు. అలాచేస్తే వధూవరుల జీవితం పచ్చగా ఉంటుందని నమ్మకం. చీడపీడలు, ఎటువంటి రుగ్మతలు దరిచేరవని భావించేవారు. కానీ ఇప్పుడంతా రెడీమేడ్‌ పందిళ్లు, మండపాలు వచ్చేశాయి. గంటల వ్యవధిలో మండపాలను సిద్ధం చేస్తున్నారు. పచ్చని పందిళ్లు బదులు విద్యుత్‌ దీపకాంతులతో స్టేజీలు అలంకరిస్తున్నారు.

ఫొటోషూట్‌కు ప్రాధాన్యం

వైవాహిక జీవితానికి సంబంధించి తొలి వేడుక పది కాలాలపాటు గుర్తుండేలా ఫొటోషూట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందుగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేస్తున్నారు. తొలుత నగరాల్లో ఉన్న ఈ సంస్కృతి పట్టణాలకు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. జిల్లాలో సుదీర సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆపై పర్యాటక ప్రాంతాలు సైతం ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ వస్తే చాలు.. ఈ పర్యాటక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. అనేక రకాల కెమెరాలు, ఇతర పరికరాలు, ప్రత్యేక యాప్‌లు అందుబాటులోకి రావడంతో వీడియోలు, ఫొటోలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా పంపించి.. బంధువులు, స్నేహితులను తమ వివాహానికి ఆహ్వానిస్తున్నారు.

ఏఐతో దివి నుంచి భువికి..

ఇటీవల ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత వివాహాలు, శుభకార్యాల్లో భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. చాలా ఇళ్లలో చనిపోయిన ఇంటి పెద్దలు ఉంటారు. వారితో వధూవరులకు విడదీయరాని బంధం ఉంటుంది. అందుకే వారిని జ్ఞప్తికి తెచ్చేలా వారి ఫొటోలతో కూడిన వీడియోలు ఏఐ ద్వారా రూపొందిస్తున్నారు. వివాహ వేడుకల్లో భారీ స్ర్కీన్లపై ప్రదర్శించి చనిపోయిన వారు వచ్చి ఆశీర్వదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత వివాహ వేడుకల్లో ఇదో నయా ట్రెండ్‌.

కొత్తగా హల్దీ సంస్కృతి...

వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్‌ సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. ఉత్తరాధి రాష్ట్రాల్లో మార్వాడీల్లో ఈ సంస్కృతి అధికంగా ఉండేది. వివాహ వేడుకల్లో భాగంగా అందరూ ఒకేరకమైన దుస్తులు ధరించడం, వధూవరులకు సుగంద ద్రవ్యాలు, పూలతో కూడిన నీటితో స్నానం చేయించడం, ముందురోజు బంధువులంతా డ్యాన్స్‌లు చేయడం ఉత్తరాధిన ఉండేది. ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈ సంస్కృతి విస్తరిస్తోంది. పల్లెలకు సైతం పాకుతోంది.

అన్ని పనులు ఒక్కరే...

వివాహ వేడుకలకు సంబంధించి ఈవెంట్‌ సంస్కృతి కూడా జిల్లాకు ఎక్కువగా పాకింది. సాధారణంగా గతంలో మైక్‌సెట్‌తోపాటు వివాహ పందిరి డెకరేషన్‌ ఒకరు చూసేవారు. వీడియోగ్రాఫర్‌, ఫొటోగ్రాఫర్‌ ఉండేవారు. భోజనాల తయారీకి సంబంధించి సామగ్రి పంపిణీ చేసే వారుండేవారు. ఆపై దక్షిణాది సన్నాయి మేళం, వంటవారు, కేటరింగ్‌ చేసేవారు వేర్వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈవెంట్‌ సంస్కృతి జిల్లాలో ప్రవేశించింది. అన్ని పనులు చేసి పెట్టే ఈవెంట్‌ మేనేజర్లు, సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఫలానా కళ్యాణమండపం, ఖాళీ స్థలం చూపిస్తే చాలు.. అన్నిరకాల సేవలు సదరు ఈవెంట్‌ సంస్థ చూసుకుంటుంది. కాంట్రాక్ట్‌ తీసుకుని.. పెళ్లి చేసే కుటుంబ సభ్యులకు ఒత్తిడి లేకుండా వేడుకలు పూర్తి చేస్తుంది.

వివాహ వ్యవస్థలో మార్పులు పుణ్యమా అని ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయి. ఒక పెళ్లి ఖర్చు రూ.10లక్షలు అయితే.. దాదాపు ఓ 100మంది వరకూ ఉపాధి దొరుకుతోంది. ఇది సంతోషించదగ్గ విషయమే. కానీ, కొత్త విధానాలతో ఖర్చు పెరిగినా.. ఆనాటి చలువ పందిళ్లు, సన్నాయి వాయిద్యాలు, రోజుల తరబడి ఉండే బంధువుల సందడి ఇప్పుడు కనిపించడం లేదని కొంతమంది పెద్దలు పేర్కొంటున్నారు. నాటి ఆప్యాయతలు తగ్గాయని వాపోతున్నారు. ప్రస్తుతం సౌకర్యం తప్ప.. అప్పట్లో ఉన్నంత ఆనందం లేదని చెబుతున్నారు. నాటి మూడురోజుల పెళ్లి.. నేడు ఒక్కరోజులోని కొన్ని గంటలకే పరిమితమవుతోందని పేర్కొంటున్నారు.

తీరు మారాలి..

వివాహం అనేది అలుమగల జీవితంలో తొలి పండుగ. గతంలో పెళ్లి అంటే మూడురోజుల పాటు జరిగేది. కానీ ఇప్పుడు ఒక్కరోజులోనే తతంగం ముగుస్తోంది. నాడు పచ్చని చలువ పందిళ్ల కింద.. భాజాభజంత్రీలతో వివాహాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఏదో ఒక సినిమా ఈవెంట్‌ మాదిరిగా జరిగిపోతున్నాయి. ఈ తీరులో మార్పు రావాలి.

- జి.మధు, పురోహితుడు, రణస్థలం

........

ఊరంతా సందడే..

30ఏళ్ల కిందట వివాహాలు అంటే ఆ ఇంట్లోనే కాదు. ఊరంతా సందడి ఉండేది. ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడేది. దగ్గర బంధువులైతే నాలుగైదు రోజుల ముందే వచ్చేవారు. కానీ ఇప్పుడు పెళ్లి రోజు వస్తున్నారు. కొద్ది గంటల పాటు ఉండి వెళ్లిపోతున్నారు. పెళ్లిళ్లు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. కానీ ఎటువంటి ఆనందం కూడా ఇవ్వడం లేదు.

- డి.సత్తిబాబు, రణస్థలం

Updated Date - Aug 05 , 2025 | 12:41 AM