Government hospital: ఇక్కడ అన్నీ సమస్యలే
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:32 PM
Doctors who are not punctual టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. వైద్యానికి అవసరమైన సామగ్రి, మందుల కొరత వేధిస్తోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదలుకొని ఆరోగ్యశాఖ డైరెక్టర్ అట్టాడ సిరి వరకు ఎంతమంది సమీక్షిస్తున్నా.. వైద్యులు, సిబ్బంది తీరు మారడం లేదు.
టెక్కలి ఆసుపత్రిలో సమయపాలన పాటించని వైద్యులు
అరకొర సిబ్బందితో అవస్థలు
రోగులకు సక్రమంగా అందని సేవలు
బయటి దుకాణాల్లోనే మందుల కొనుగోలు
నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సలహా సంఘ సమావేశం
టెక్కలి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. వైద్యానికి అవసరమైన సామగ్రి, మందుల కొరత వేధిస్తోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదలుకొని ఆరోగ్యశాఖ డైరెక్టర్ అట్టాడ సిరి వరకు ఎంతమంది సమీక్షిస్తున్నా.. వైద్యులు, సిబ్బంది తీరు మారడం లేదు. వారు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదు. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఆస్పత్రిని పరిశీలించగా 30మంది వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే విషయాన్ని గుర్తించి మందలించారు. అలాగే ఇక్కడ వైద్యులు, సిబ్బంది 32మంది వరకు కొరత ఉంది. స్టాఫ్‌నర్సులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆసుపత్రికి ఇన్‌పేషెంట్లు సుమారు 140మంది, ఔట్‌పేషెంట్లు 600మంది వరకు రోజూ వస్తున్నారు. సరిపడా మందులకు బడ్జెట్ చాలడం లేదు. సర్జికల్‌కు సంబంధించి మూడు కోట్లకు రూ.14.25 లక్షలు, మందులకు సంబంధించి నాలుగు కోట్లకు రూ.79.76లక్షలు విడుదల చేశారు. అవి చాలకపోవడంతో వైద్యులు కొన్నిరకాల మందులను బయట రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. ఆర్థోపెడిక్ ఆపరేషన్ల సమయాల్లో అవసరమైన సామగ్రి లేదని ఓ వైద్యుడు ఏకంగా బయటే రోగులచే కొనిపించడం పరిపాటిగా మారింది.
మూతపడిన ఆలా్ట్రసౌండ్ స్కానింగ్
రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఆలా్ట్రసౌండ్ స్కానింగ్ మూతపడింది. వెంటిలేటర్లు ఉన్నా నిపుణులు లేక వాటిని వినియోగించని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి తరచూ విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యలతో ఆపరేషన్ థియేటర్‌లో పలు పరికరాలు దెబ్బతింటుండగా ల్యాబ్ పరీక్షలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రిలో లిఫ్ట్ ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. రోగులు బెడ్ల మీద పరిచే దుప్పట్లు, ఆపరేషన్ థియేటర్‌లోని దుస్తులు తడిపేందుకు దోబీ లేరు. దీంతో శానిటేషన్ సిబ్బందితో తాత్కాలికంగా దోబీ పనులు చేయించాల్సి వస్తోంది. మంచాలపై ఒక్కోసారి దుప్పట్లు ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. బెంచ్‌లు, కుర్చీలు సౌకర్యం లేదు. బయోమైక్రోల్యాబ్ నిరుపయోగంగా మారింది. ఈసీజీ టెక్నీషియన్ లేకపోవడంతో ఇతర సిబ్బందితో ఆ పనులు తూతూమంత్రంగా చేయించాల్సి వస్తోంది.
ఫ్రీజర్, అంబులెన్స్‌లు లేవు
ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ గాడితప్పింది. ఆసుపత్రి వెనుక ప్రాంతంలో మురుగునీటి సమస్య వెంటాడుతోంది. ప్రమాదంలో ఎవరైనా చనిపోయిన వ్యక్తుల మృతదేహాలు ఉంచడానికి ఫ్రీజర్ సౌకర్యం లేదు. దీంతో మూడు కిలోమీటర్ల దూరంలో గల పాత జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కరెంటు లేని గదిలో మృతదేహాలను పడేస్తున్నారు. అంబులెన్స్‌ల సౌకర్యం లేకపోవడంతో రోగులను అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు అవస్థలు తప్పడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారని తెలిస్తే పరిశుభ్రతతో పాటు రోగులు మంచాలపై బెడ్‌షీట్లు వేసి కాలం వెళ్లబచ్చుతున్నారు. బుధవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సలహా సంఘ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలోనైనా సమస్యలపై చర్చించి.. సౌకర్యాలు మెరుగుపడేలా, సక్రమంగా సేవలు అందించేలా అధికారులు, పాలకులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.