Mango trees: మామిడి రైతుకు దిగులు!
ABN , Publish Date - May 06 , 2025 | 11:25 PM
Mango Farmers Crop Loss మామిడి పంట చేతికి అందివచ్చే వేళ.. ఈదురుగాలులు, అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి పూత దశలో పొగమంచు, దోమపోటు బెడద వెంటాడింది. మందులు పిచికారీ చేయడంతో కొంతమేర పూత, పిందెలు నిలబడ్డాయి. ప్రస్తుతం కాయలు కాయగా.. ఈదురుగాలుల ప్రభావంతో చాలాచోట్ల అవి రాలిపోతున్నాయి.
పూత దశ నుంచీ కష్టాలే
ఈదురుగాలులకు నేలరాలుతున్న కాయలు
మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురానికి చెందిన రుక్మాందరావుకు మూడు ఎకరాల మామిడితోట ఉంది. ఐదేళ్లుగా మామిడి దిగుబడి లేక నష్టపోతున్నానని ఆందోళన చెందుతున్నాడు. ఏటా మూడుసార్లు దుక్కితోపాటు గత్తం, ఎరువులు, పురుగుల మందు పిచికారీకి రూ.30వేల వరకూ ఖర్చువుతోంది. దిగుబడి మాత్రం రూ.10వేలకు మించి రావడం లేదని వాపోతున్నాడు.
..................
మెళియాపుట్టి మండలం కొసమాళ గ్రామానికి చెందిన అంకడాల లోకనాథం అనే రైతుకు 8 ఎకరాల మామిడితోట ఉంది. నాలుగేళ్ల నుంచి ఆశించినస్థాయిలో దిగుబడి రావడం లేదు. పెట్టుబడి పెరుగుతున్నా.. దిగుబడి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని లోకనాథం ఆవేదన చెందుతున్నాడు.
...................
మెళియాపుట్టి, మే 6(ఆంధ్రజ్యోతి): మామిడి పంట చేతికి అందివచ్చే వేళ.. ఈదురుగాలులు, అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి పూత దశలో పొగమంచు, దోమపోటు బెడద వెంటాడింది. మందులు పిచికారీ చేయడంతో కొంతమేర పూత, పిందెలు నిలబడ్డాయి. ప్రస్తుతం కాయలు కాయగా.. ఈదురుగాలుల ప్రభావంతో చాలాచోట్ల అవి రాలిపోతున్నాయి. కొన్నిచోట్ల వడగళ్ల వర్షం కూడా పడుతుండంతో మామిడికాయలపై మచ్చ తెగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో తమకు ఈ ఏడాదీ నష్టాలు తప్పేలా లేవని రైతులు వాపోతున్నారు. జిల్లాలో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, రణస్థలం, పొందూరు, పోలాకి, జలుమూరు, సారవకోట, జి.సిగడాం, లావేరు మండలాల్లో అధికంగా మామిడితోటలు ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 2,024 హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నట్టు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. రెండేళ్ల కిందట ఎకరాకు సుమారు మూడు టన్నుల వరకు దిగుబడి వచ్చేది. ఇటీవల అకాల వర్షాలకు, ఈదురుగాలుల ఉధృతికి చాలాచోట్ల మామిడికాయలు నేలరాలాయి. వాతావరణం మార్పుల కారణంగా ఈసారి ఎకరాకు టన్ను దిగుబడి అయినా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూతదశలోనే మామిడి తోటలు కొనుగోలు చేసేందుకు కాకినాడ, బరంపురం, అనకాపల్లి, పలాస, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పోటీ పడేవారు. మూడేళ్ల నుంచి గాలుల కారణంగా మామిడికాయలు రాలిపోయి పంట నష్టపోతున్నారు. దీంతో మామిడితోటల కొనుగోలుకు ఈ ఏడాది వ్యాపారులెవరూ ఆసక్తి చూపలేదు. ఫలితంగా రైతులకు నష్టం తప్పడం లేదు.
బీమా ఉన్నా కట్టలేక..
గతంలో మామిడి పంట నష్టపోయినా వైసీపీ ప్రభుత్వం బీమా ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం జీడి, మామిడి రైతులకు బీమా సౌకర్యం కల్పించింది. ఏడాదికి ఎకరాకు రూ.1,600 చెల్లిస్తే.. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే రూ.44వేల వరకూ పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించింది. కాగా ప్రీమియం ఎక్కువ కావడంతో రైతులు ఈ బీమా సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
ఈఏడాది నుంచే బీమా..
ఈ ఏడాది నుంచి జీడి,మామిడి రైతులకు పంటలు బీమాను ప్రభుత్వం వర్తింపజేసింది. జీడి రైతులు ప్రీమియం చెల్లించటానికి ముందుకు వచ్చినా, మామిడి రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈఏడాది ఎంత మేరకు పంట నష్టం జరిగిందో అంచనాలు రూపొందించి.. ప్రీమియం చెల్లించిన వారికి పరిహారం అందజేస్తాం.
- దుక్క శరత్‌రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి, మెళియాపుట్టి