Mandatory attendance: ఎంఈవోలకు ముఖహాజరు తప్పనిసరి
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:56 PM
School inspections.. Attendance rules మండల విద్యాశాఖ అధికారులతోపాటు, ఎమ్మార్సీలో పనిచేస్తున్న సిబ్బంది ఇక నుంచి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ముఖహాజరు తప్పనిసరిగా వేయాలని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు.
ఉదయం 9గంటలకే ఎమ్మార్సీ సిబ్బందికి విధులు
పనితీరు మెరుగుకు ప్రభుత్వం చర్యలు
రోజుకో పాఠశాల తనిఖీ చేయాలని కమిషనర్ ఆదేశాలు
నరసన్నపేట, జూలై 22(ఆంధ్రజ్యోతి): మండల విద్యాశాఖ అధికారులతోపాటు, ఎమ్మార్సీలో పనిచేస్తున్న సిబ్బంది ఇక నుంచి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ముఖహాజరు తప్పనిసరిగా వేయాలని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈవోలు రోజూ ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలల పర్యవేక్షణ, విద్యాపథకాల అమలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల పనితీరు, ప్రమాణాలను పర్యవేక్షించే బాధ్యత ఎంఈవోలదే. అలాగే క్లస్టర్‌స్థాయిలో విద్యా ప్రమాణాలను మెరుగుపడేందుకు, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు సీఆర్‌పీ వ్యవస్థను పదేళ్ల కిందట ఏర్పాటు చేశారు. వైసీపీ పాలనలో ప్రతీ మండలానికి అదనంగా ఎంఈవో-2ను నియమించారు. ఈ లెక్కన జిల్లాలో 30 మండలాలకు ఇద్దరేసి ఉన్నారు. అయినా పాఠశాలల పర్యవేక్షణ గాడిన పడలేదు. పైగా ఇద్దరు ఎంఈవోలు ఉండంతో జిల్లాలో పలు మండలాల్లో వారి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇంకోవైపు చాలామంది ఎంఈవోలు స్థానికంగా ఉండడం లేదు. జిల్లా, డివిజన్ కేంద్రంలోనే నివాసం ఉంటున్నారు. దీనితో పనివేళలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు జిల్లాకేంద్రంలో ఉంటూ ఇక్కడి నుంచే ఏదో ఒక పనికారణం చూపి ముఖహాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఎమ్మార్సీలో పనిచేస్తున్న సీఆర్‌పీలు, ఆపరేటర్లు, ఇతర కిందస్థాయి సిబ్బందికూడా ఉదయం 9గంటలకు ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది.
హాజరు, తనిఖీలపై రోజూ నివేదిక
ఎంఈవోలు తోచిన కారణాలు చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా కమిషనర్ చర్యలు చేపట్టారు. టీచర్ల మాదిరిగానే ఉదయం 9.30 గంటలకు ఎంతమంది ఎంఈవోలు హాజరు వేసిందీ జిల్లా విద్యాశాఖ ప్రతిరోజూ కమిషనరేట్‌కు నివేదిక పంపించాలి. ప్రతిరోజూ ఒక పాఠశాలను ఎంఈవో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. గతంలో కొందరు ఎంఈవోలు మండల కేంద్రాలు లేదా డివిజన్ కేంద్రం నుంచి ఎప్పుడో బయలుదేరి దగ్గర ఉన్న పాఠశాలలకు వెళ్లి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి హాజరైనట్లు నమోదు చేసుకునేవారు. ఇప్పుడు అలాకాకుండా ఎంఈవోలకు జీపీఎస్ విధానం అమలు చేస్తున్నారు. ఎమ్మార్సీలకు వెళ్లినా, పాఠశాలలకు వెళ్లినా.. అక్కడి లోకేషన్ చూపిస్తుంది. తాజా ఉత్తర్వులతో కొంతమంది ఎంఈవోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ విషయమై డీఈవో ఎస్.తిరుమల చైతన్య వద్ద ప్రస్తావించగా.. ‘ఎంఈవోలు, ఎమ్మార్సీ సిబ్బంది కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఎమ్మార్సీలకు వెళ్లి ముఖహాజరు వేయాలని, రోజు ఒక పాఠశాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఇటీవల కమిషనర్ ఆదేశాలను జారీ చేశార’ని తెలిపారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు.