ఇక్కడ మండలం.. అక్కడ రెవెన్యూ డివిజన్
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:18 AM
Unintentional district re-division వైసీపీ హయాంలో అనాలోచితంగా జిల్లా పునర్విభజన చేయడంతో కొన్ని మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఉండే మండలాలు.. ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలి. కానీ పలు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలను మరో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంచడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
వైసీపీ హయాంలో అనాలోచితంగా జిల్లా పునర్విభజన
పెరుగుతున్న రెవెన్యూ సమస్యలు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
లోపాలు సరిదిద్దే దిశగా చర్యలు
శ్రీకాకుళం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అనాలోచితంగా జిల్లా పునర్విభజన చేయడంతో కొన్ని మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఉండే మండలాలు.. ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలి. కానీ పలు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలను మరో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంచడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. దీనిపై అప్పట్లో జిల్లాలోని వైసీపీ కీలక నాయకులు కూడా తమ అధినేతకు వివరించే పరిస్థితి లేదు. అధికారులు కూడా అనాలోచితంగా వ్యహరించి.. ఇప్పుడు కొన్ని మండలాల ప్రజల అవస్థలకు కారణమయ్యారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాల్లో 38 మండలాలు ఉండేవి. పునర్విభజనలో భాగంగా 2022లో పాలకొండ నియోజకవర్గాన్ని(నాలుగు మండలాలు) పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపివేశారు. రాజాం నియోజకవర్గాన్ని (నాలుగు మండలాలు) విజయనగరంలో కలిపేశారు. దీంతో ఎనిమిది నియోజకవర్గాలు 30 మండలాలతో శ్రీకాకుళం జిల్లా మిగిలింది. గతంలో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లు ఉండేవి. పాలకొండ స్థానంలో పలాస రెవెన్యూ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని మండలాలను అదే నియోజకవర్గంలో ఉంచి.. దూరంగా.. ప్రజలకు భారంగా ఉండే మరో రెవెన్యూ డివిజన్‌లో చేర్చారు.
శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ప్రజలకు రెవెన్యూ డివిజన్ పరంగా ఏవిధమైన సమస్య లేదు. వారికి సబ్‌డివిజన్లు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సమస్య వస్తే అక్కడకు వెళ్లి పరిష్కరించుకుంటున్నారు.
టెక్కలి నియోజకవర్గంలో ‘నందిగాం’ మండలాన్ని పునర్విభజన సమయంలో టెక్కలి నియోజకవర్గంలో ఉంచుతూ.. రెవెన్యూ డివిజన్‌ను మాత్రం పలాసలో చేర్చారు. దీంతో ఈ మండల ప్రజలు రెవెన్యూ, ఇతర సమస్యలను విన్నవించుకునేందుకు ఇబ్బందులు పడుతూ పలాస వెళ్తున్నారు. నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లో కలిపేయాలంటూ ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు.
నరసన్నపేట నియోజకవర్గంలో సారవకోట మండలాన్ని టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో కలిపేశారు. అంతకుముందు ‘సారవకోట’ మండలం పాలకొండ డివిజన్‌లో ఉండేది. ఇప్పుడు శ్రీకాకుళానికి కాస్త దగ్గరగా ఉన్న సారవకోట ప్రజలకు.. రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారం కోసం టెక్కలి వెళ్లాలంటే ఇబ్బందికరమే.
పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు మండలాలు ఉన్నాయి. ఇందులో ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాలకు శ్రీకాకుళం దగ్గర. ఈ మండలాల ప్రజలు ఎప్పటి నుంచో.. తమను శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో కలపాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. ఇది ఎప్పటికి కార్యరూపం దాల్చేనో.
ప్రభుత్వ చర్యలతో ఆశలు..
వైసీపీ సర్కారు సమయంలో జరిగిన తప్పిదాన్ని సరి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మంత్రివర్గం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో.. కొన్ని మండలాలు.. మరో రెవెన్యూ డివిజన్‌లో ఉండటంపై చర్చించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో మండలాలు.. మరో రెవెన్యూ డివిజన్‌లో ఉండటంపై... సమగ్ర నిర్ణయం తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. ప్రజలకు ఆమోదంగా ఉండేలా దగ్గరగా.. సౌలభ్యంగా ఉండే రెవెన్యూ డివిజన్‌లో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.