Mansarovar Yatra: విశాఖ చేరిన ‘మానస సరోవర’ యాత్రికులు
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:14 AM
pilgrims reach Visakhapatnam మానస సరోవర్ యాత్రకు వెళ్లిన జిల్లావాసులు క్షేమంగా గురువారం విశాఖ చేరుకున్నారు. నేపాల్ మీదుగా మానససరోవర యాత్రకువెళ్లి.. అక్కడ ఊహించని విధంగా కఠ్మాండూలో రాష్ట్రానికి చెందిన 186 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వాళ్లందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ శ్రద్ధచూపారు.
సాదరంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు
మంత్రి లోకేశ్ వల్లనే నేపాల్ నుంచి రాగలిగామన్న జిల్లావాసులు
శ్రీకాకుళం/ సంతబొమ్మాళి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మానస సరోవర్ యాత్రకు వెళ్లిన జిల్లావాసులు క్షేమంగా గురువారం విశాఖ చేరుకున్నారు. నేపాల్ మీదుగా మానససరోవర యాత్రకువెళ్లి.. అక్కడ ఊహించని విధంగా కఠ్మాండూలో రాష్ట్రానికి చెందిన 186 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వాళ్లందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ శ్రద్ధచూపారు. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరంతోపాటు, శ్రీకాకుళం మండలం రాగోలు, సంతబొమ్మాళి మండలానికి చెందినవారు.. 17మంది మానససరోవర యాత్రకు వెళ్లారు. వారిలో శ్రీకాకుళం నగరానికి చెందిన వానపల్లి శంకరర్రావు, కపిలేశ్వరి, బరాటం గుర్నాథం, కామేశ్వరి, రాగోలు ప్రాంతానికి చెందిన బొంతల సత్యవతి, శంకర్, సంతబొమ్మాళి మండలానికి చెందిన సాహుకారు బాలరాజు, ఝాన్సీరాణి, నెమలపురి వెంకటరావు, సంతోష్ లక్ష్మి ప్రత్యేక విమానంలో గురువారం విశాఖపట్టణం చేరుకున్నారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్ ఈశ్వరరావు విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జిల్లా యాత్రికులకు సాదరస్వాగతం పలికారు. యాత్రికులతో మాట్లాడి.. వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నారా లోకేశ్ చొరవతో తాము క్షేమంగా చేరుకున్నామని వారు తెలిపారు.
ప్రభుత్వానికి, మంత్రులకు రుణపడి ఉంటాం
ఈ నెల 3న ట్రావెల్ ఏజెన్సీలో మొత్తం 81 మంది నేపాల్ పర్యటనకు వెళ్లాం. అక్కడ కొన్ని దేవాలయాలు సందర్శించాం. లాడ్జిలో బస చేశాం. నేపాల్‌లో అల్లర్ల నేపథ్యంలో లాడ్జిలోనే ఉండిపోయాం. బయటకు వెళ్లాలంటే భయం వేసేది. కేంద్ర, రాష్ట్ర మం త్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, నారా లోకేశ్ మాతో మాట్లాడి ప్రత్యేక విమానాల్లో స్వగ్రామానికి చేర్చుతామని చెప్పడంతో కొండంత ధైర్యం వచ్చింది. కఠ్మాండూ నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకున్నాం. అక్కడ నుంచి కొందరిని విశాఖకు, మరికొందరిని తిరుపతి విమానశ్రయాలకు ఉచితంగా చేర్చారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాకు స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సుల్లో స్వగ్రామాలకు చేర్చారు. ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు రుణపడి ఉంటాం.
- సాహుకారి బాలరాజు, సంతబొమ్మాళి
మంత్రి లోకేశ్ చూపిన శ్రద్ధను మరువలేము
మాది శ్రీకాకుళం నగరంలో టీపీఎం స్కూల్ దరి. ఉత్సాహంగా యాత్రకు వెళ్లి చిక్కుకున్నాం. మూడు రోజులు హోటల్‌లోనే ఉండిపోయాం. మంత్రి నారా లోకేశ్ అత్యంత శ్రద్ధ చూపి.. మా అందరితో రెండు రోజుల నుంచి మాట్లాడి మాకు ధైర్యం ఇచ్చారు. అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడించి.. మేము కేవలం ఆధార్‌తోనే విశాఖపట్టణం వరకు విమానంలో వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వచ్చేవరకు ఎంతగానో భయపడ్డాం. క్షేమంగా చేరుకున్నాం. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అంతకుమించి మంత్రి నారా లోకేశ్ వల్లనే సాధ్యమైంది. లోకేశ్‌ను ఏనాటికీ మరువలేము. ఇక్కడకు రాగానే మా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.
- వానపల్లి శంకర్రావు, కపిలేశ్వరి దంపతులు, శ్రీకాకుళం.
ఆపదలో అండగా నిలిచారు :
మానస సరోవర్ యాత్రికులకు ఆపదలో మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. నేపాల్‌లో జరుగుతున్న మారణహోమంలో తెలుగువారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు. కేంద్రం అండతో.. సమన్వయంతో ఈ ఆపదలో ఉన్న ఒక్కొక్కరినీ సురక్షితంగా రక్షించేందుకు మంత్రి లోకేశ్ పక్కా వ్యూహంతో ముందుకు కదిలారు.
- గొండు శంకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే