ఆరు కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:22 AM
శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో శనివారం ఆరు కిలోల గంజాయితో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
ఆమదాలవలస, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో శనివారం ఆరు కిలోల గంజాయితో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ బాలరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా జిగిడి పదర్ గ్రామానికి చెందిన మార్క్ సబర్ ఇదే రాష్ర్టానికి చెందిన సామల్య అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైలోని లక్ష్మణ్ అనే వ్యక్తికి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే శనివారం కూడా 6.900కిలోల గంజాయితో చెన్నై వెళ్లేందుకు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు చేరుకుని పార్కింగ్ ప్రదేశంలో వేచి ఉండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా.. గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో గంజాయి స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగిలిన ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
ఇరువర్గాల మధ్య కొట్లాట
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నగరంలోని అరసవల్లి జంక్షన్ వద్ద ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద శనివారం రెండు వర్గాల మధ్య జరిగిన కొ ట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. శ్రీకాకుళం రూరల్ కిష్టప్పపేటకు చెందిన కొర్ను రాజు, వాంబే కాలనీకి చెందిన అంబటి తరుణ్ వేర్వేరుగా సప్లయర్స్ దుకాణాలు నడుపుతున్నారు. రాజుకు సప్లయర్స్ లావాదేవీలో తరుణ్ రూ.1.30 లక్షలు బకాయి ఉన్నాడు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని రాజు అడగ్గా సోమవారం ఇస్తానని తరుణ్ చెప్పాడు. అయితే ప్రస్తుతం నీవు ఎక్కడ ఉన్నావని రాజు ప్రశ్నించగా.. అరసవల్లి జంక్షన్ వద్ద మద్యం దుకాణంలో ఉన్నట్టు తరుణ్ సమాధానం ఇచ్చాడు. దీంతో రాజు మరో ఇద్దరితో కలిసి అక్కడికి చేరుకుని ఇప్పుడే డబ్బులు ఇవ్వాలని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. రాజుతో ఉన్న ఇద్దరు, అలాగే తరుణ్‌తో ఉన్న మరో నలుగురు బాహాబాహీకి దిగి నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీనితో పలువురికి గాయాల య్యాయి. వీరంతా చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌లో చేరారు. రిమ్స్ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోరీ కేసులో నలుగురి అరెస్టు
పలాస, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రామకృష్ణాపురం గ్రామం సమీపంలో ఉన్న సత్యసాయి విద్యావాహార్‌కు చెందిన రూ.1.40 లక్షల విలువైన ఐరన్ స్తంభాలు నాలుగు రోజుల కిందట చోరీకి గురయ్యాయి. దీనిపై సంస్థ చైర్మన్ మల్లా రామేశ్వరరావు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా.. చోరీకి పాల్పడిన నలుగురిని శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించారు. వారిని పాతపట్నం సబ్‌జైలుకు తరలించారు. మాకనపల్లి గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని ప్రశ్నించగా దొంగతనం చేసిన విషయం బయటపడింది. చోరీకి గురైన ఐరన్ స్తంభాలతో పాటు తరలించడానికి ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్టు సీఐ తెలిపారు.