Making of Ganesha idols: మట్టి ప్రతిమ చేసి.. సృజనాత్మకత చాటి..
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:12 AM
‘Bojja Ganapayya in the hands of Bujjayis’ వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘బుజ్జాయిల చేతిలో బొజ్జ గణపయ్య’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. అరసవల్లి రోడ్డులోని ఎల్‌ఎన్ గ్రీన్స్ ఫంక్షన్ హాల్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించగా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మట్టి వినాయక ప్రతిమలు చేసి.. సృజనాత్మకతను చాటారు.
ఉత్సాహంగా ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘బుజ్జాయిల చేతిలో బొజ్జ గణపయ్య’ నిర్వహణ
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వినాయక విగ్రహాల తయారీ
ప్రతిభ చూపిన విద్యార్థులు
అరసవల్లి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘బుజ్జాయిల చేతిలో బొజ్జ గణపయ్య’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. అరసవల్లి రోడ్డులోని ఎల్‌ఎన్ గ్రీన్స్ ఫంక్షన్ హాల్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించగా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మట్టి వినాయక ప్రతిమలు చేసి.. సృజనాత్మకతను చాటారు. ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఆర్.టీ.రవితేజ డెవలపర్స్ అధినేత, బీజేపీ నాయకుడు, ఏబీబీఎస్ జాతీయ కన్వీనర్ పోకతోట సింహాచలం, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, డా.శశిధర్ ఆసుపత్రి ఎమ్‌డీ డా.అన్నెపు శశిధర్, ఏషియన్ కేన్సర్ ఆసుపత్రి అధినేత డా.రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ సోమశంకరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శిల్పి టి.ప్రసాదరావు వినాయక ప్రతిమ తయారీ విధానాన్ని వివరించారు. దాని ప్రకారం విద్యార్థులు సృజనాత్మకతతో మట్టి ప్రతిమలు తయారుచేశారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులు తయారుచేసిన ప్రతిమలను పరిశీలించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ చిన్నారులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. సంస్కృతీ సంప్రదాయాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పిల్లలవలస జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ప్రథమ బహుమతి గురుగుబెల్లి చైతన్య, ద్వితీయ బహుమతి బి.దామోదర్, తృతీయ బహుమతి బుడుమూరు గోవిందమ్మలకు లభించాయి. అలాగే అదే పాఠశాలకు చెందిన ఎ.మౌనిక, పి.తనూజ, జి.యామిని, శ్రీకాకుళంలోని వికాస్ హైస్కూల్ విద్యార్థులు సిహెచ్.పద్మశ్రీ, పి.శాంతిశ్రీ, న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ఎం.సిద్ధార్థరెడ్డి, ఎ.హరిచరణ్, కె.గిరిప్రసాద్, బి.కుమారస్వామి, పి.వాసులకు కన్సొలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా ఆర్‌టీ రవితేజ డెవలపర్స్ అధినేత పోకతోట సింహాచలం, కో స్పాన్సర్‌లుగా ‘ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి’, డా.శశిధర్ హాస్పిటల్, ఏషియన్ కేన్సర్ ఆస్పత్రి, శుభం సిల్వర్, జీఎన్ జ్యూవెలరీస్, న్యూ సెంట్రల్ స్కూల్, వండాన హాస్పిటల్, ఎస్‌ఎస్ జ్యూవెలరీ మార్ట్‌లతోపాటు.. బీజీఆర్ ఫౌండేషన్, శ్రీ విజయ వెంకటేశ్వర జ్యూవెలర్స్, ఎస్‌వీ కార్డియక్ మల్టీ స్పెషాలిటీ కేర్, ఆనందసాయి జ్యూవెలర్స్ అధినేతలు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్ రిపోర్టర్ టి.సురేష్‌బాబు, యాడ్ మేనేజర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భాగస్వామిని కావడం అదృష్టం
పాఠశాల విద్యార్థులతో ఇంత చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కు అభినందనలు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వినాయక చవితిని జరుపుకునే విధంగా అవగాహన కల్పించేందుకు, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఇటువంటి కార్యక్రమానికి సహకరించగలగడం నా అదృష్టం.
-పోకతోట సింహాచలం, ఆర్‌టీ డెవలపర్స్ (ప్రధాన స్పాన్సరర్)
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అనారోగ్యం
పర్యావర ణ పరిరక్షణ అందరి బాధ్యత. చిన్నారులకు ఇప్పటి నుంచే పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించడం, మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించడం ఎంతో మంచి పరిణామం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు అందులో గల సీసం, మెగ్నీషియం. సల్ఫర్ నీటిలో కలిసి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరంగా మారతాయి. మట్టి విగ్రహాలను వాడడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా మనం పండుగను జరుపుకోగలుగుతాం.
-కరుణశ్రీ, కాలుష్య నియంత్రణ సంస్థ ఇంజినీర్
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.
-డాక్టర్ అన్నెపు శశిధర్, డా.శశిధర్ హాస్పిటల్స్
ఆరోగ్యానికి మేలు
నేడు కేన్సర్ కేసులు అధికంగా వస్తున్నాయి. మట్టి విగ్రహాల వినియోగం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, ఇటువంటి భయంకర వ్యాధుల నివారణకు కూడా ఎంతో దోహదం చేస్తుంది. అందరూ ఆరోగ్యకరమైన వినాయక చతుర్థిని జరుపుకోవాలి
-డాక్టర్ రవీంద్ర, కేన్సర్ స్పెషలిస్టు (ఏషియన్ కేన్సర్ ఆసుపత్రి)
చిన్నారుల సృజనాత్మకత ప్రశంసనీయం
చిన్నారులు ఎంతో సృజనాత్మకతతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. నిజంగా చాలా గొప్పగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ’కు అభినందనలు.
- ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి
ప్రథమ బహుమతి రావడం అనందంగా ఉంది
ప్రథమ బహుమతి గెలుచుకోవడం అనందంగా ఉంది. నేను తయారు చేసిన ఇదే మట్టి వినాయక ప్రతిమతో ఈ ఏడాది మా ఇంట్లో వినాయక చవితి పండుగ ను జరుపుకుంటాం. అందరూ పర్యావరణాన్ని రక్షించాలి. మట్టి ప్రతిమలనే వినియోగించాలి. అందరికీ ఈ విషయంపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తా..
- గురుగుబెల్లి చైతన్య, ప్రథమ బహుమతి జెడ్పీహెచ్‌ఎస్, పిల్లలవలస
అవగాహన కలిగింది
తొలిసారిగా ఈ పోటీల్లో పాల్గొని... బహుమతి గెలుచుకున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో అవగాహన కలిగింది. ఇకపై ఏటా నేనే స్వయంగా మట్టి విగ్రహాలను తయారుచేసి పంపిణీ చేస్తా. వాటినే మా ఇంటిలో పూజకు వినియోగిస్తా. ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు.
- బి.దామోదర్, ద్వితీయ బహుమతి, జెడ్పీహెచ్‌ఎస్, పిల్లలవలస
మట్టి విగ్రహాలనే వినియోగించాలి
అందరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలి. మట్టి ప్రతిమను ఎలా తయారు చేయాలో ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్నాను. పర్యావరణాన్ని కాపాడుతూ అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలి.
-బుడుమూరు గోవిందమ్మ, తృతీయ బహుమతి, జెడ్పీహెచ్‌ఎస్, పిల్లలవలస