Share News

Lift Irrigation : నిర్వహణ కష్టమే

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:05 AM

Maintenance issues Irrigation projects వంశధార నదీ తీరాన కొత్తూరు మండలం కడుమ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్వహణ రైతులకు భారమవుతోంది. అధికారులు, పాలకులు దీనిని పట్టించుకోవడం లేదంటూ రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

Lift Irrigation : నిర్వహణ కష్టమే
కడుమ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం

  • కడుమ ఎత్తిపోతల పథకంపై నిర్లక్ష్యం

  • పట్టించుకోని అధికారులు, పాలకులు

  • రైతులపైనే ఎకరాకు రూ.వెయ్యి చొప్పున భారం

  • శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు

  • కొత్తూరు, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): వంశధార నదీ తీరాన కొత్తూరు మండలం కడుమ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్వహణ రైతులకు భారమవుతోంది. అధికారులు, పాలకులు దీనిని పట్టించుకోవడం లేదంటూ రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. కడుమ, జగన్నాఽథపురం, హంస, బలద గ్రామాల పరిధిలో సుమారు 480 ఎకరాలకు సాగునీరు అందక పంట పొలాలు బీడువారేవి. ఈ నేపథ్యంలో రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 మార్చిలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాబార్డు నిధులు రూ.1006.18 లక్షలు నిధులు మంజూరు చేశారు. వాస్తవానికి తక్కువ భూమి ఉంటే ఎత్తిపోతల పథకం మంజూరు కాదు. ఈ నేపథ్యంలో అధికారులే లేని భూమిని 1160 ఎకరాలు ఉన్నట్లు చూపి.. ఎకరానికి రూ.లక్ష చొప్పున ఖర్చువుతుందని అంచనాలు రూపొందించారు. ఆపై టెండర్లు పిలవగా.. కాంట్రాక్టర్‌ నిర్ణీత గడువులోగా పనులను పూర్తిచేసి.. 2021 ఆగస్టులో అధికారులకు అప్పగించారు. కాగా, టీడీపీ ప్రభుత్వం మారి.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించలేదు. దీంతో నాలుగు గ్రామాల రైతులే సాహసించి ఈ పథకాన్ని ప్రారంభించారు. పొలాలకు సాగునీటిని వినియోగించారు. కాంట్రాక్టర్‌ రెండేళ్లపాటు నిర్వహణ చేపట్టి.. వదిలేశారు. దీంతో నిర్వహణ బాధ్యత రైతులపై పడింది. ఎకరాకు రూ.వెయ్యి చొప్పున చందాలు వేసుకుని నిర్వహణ కొనసాగిస్తున్నారు. కాగా, పెరుగుతున్న సాగు ఖర్చులు, పెట్టుబడి వ్యయం నేపథ్యంలో ఎత్తిపోతల పథకం నిర్వహణ కూడా భారమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • వంశధార నదీ గర్భం నుంచి సాగు భూములు ఎత్తుగా ఉన్నాయి. నదిలో పంపుహౌస్‌ చుట్టూ ఇసుక మేటలు వేయడంతో నీటి ప్రవాహం తగ్గి శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. దీంతో ఆయా రైతులు ఎకరాకు రూ.వెయ్యి చొప్పున చెల్లించడం లేదు. దీంతో నిర్వహణ మరింత కష్టమవుతోందని రైతులు వాపోతున్నారు. నాలుగు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా మరో నాలుగు పాయింట్‌లు నిర్మించాలని నీటిపారుదలశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కడుము గ్రామానికి చెందిన వలురౌతు ధర్మారావు, బూరాడ గోవిందరావు, మంతాన అప్పారావు తదితర రైతులు కోరుతున్నారు. ఎత్తిపోతల పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పథకం నిర్వహణకుగానూ టెక్నీషియన్‌ను, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

  • ఈ విషయమై నీటిపారుదలశాఖ ఈఈ సుబ్రహ్మణ్యం వద్ద ప్రస్తావించగా ‘కడుము ఎత్తిపోతల పథకాన్ని రైతులే ప్రారంభించారని తెలిసింది. ప్రస్తుతం రైతులకు సాగునీరు అందుతోంది. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి చర్యలు చేపడతామ’ని తెలిపారు.

Updated Date - Jun 27 , 2025 | 12:05 AM