Development of temples: ఆలయాలకు మహర్దశ
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:12 AM
Development of temples: జిల్లాలోని ఎండల మల్లన్న, కొత్తమ్మతల్లి ఆలయాలకు మహర్దశ పట్టింది.
- ఎండల మల్లన్న, కొత్తమ్మతల్లి దేవస్థానాలకు నిధులు
- రెండింటికి రూ.6.40కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషి
శ్రీకాకుళం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎండల మల్లన్న, కొత్తమ్మతల్లి ఆలయాలకు మహర్దశ పట్టింది. ఈ రెండు ఆలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కింద ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి రూ.2.40 కోట్లు, కోటబొమ్మాళి మండలంలోని కొత్తమ్మతల్లి ఆలయానికి రూ.4 కోట్లు మొత్తం రూ.6.40కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఈ ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ బుధవారం ఉత్తర్వులను జారీచేశారు. కాగా, ఈ ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు.
ఈ నెల 12న జరిగిన సీజీఎఫ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రెండు ఆలయాలకు నిధులు మంజూరయ్యాయి. ఈ గ్రాంటును పొందేందుకు దేవదాయశాఖ కొన్ని కీలక నిబంధనలను విధించింది. ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో అలంకరణ ప్రాకారం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. మొత్తం అంచనా వ్యయం రూ.3 కోట్లు అని ప్రతిపాదించారు. సీజీఎఫ్ వాటా కింద ప్రస్తుతం రూ.2.40 కోట్లు విడుదల కాగా, మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్(ఎంసీ) నుంచి రూ. 60 లక్షలు మంజూరు చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ మెమో జారీ అయిన తేదీ నుంచి ఒక నెల రోజులలోపు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ రూ.60 లక్షలు మొత్తాన్ని జమ చేయాల్సిఉంది. నిర్ణీత గడువులోపు జమ చేయకుంటే సీజీఎఫ్ గ్రాంట్ మంజూరు చేయబడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
కొత్తమ్మ తల్లి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.5 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. సీజీఎఫ్ గ్రాంటు కింద రూ. 4కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్(ఆలయ వాటా) కింద రూ.కోటి ఆలయ తరఫున జమ చేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లోగా ఈ మ్యాచింగ్ గ్రాంటును జమ చేయకుంటే.. సీజీఎఫ్ నుంచి మంజూరైన రూ. 4 కోట్లు రద్దు చేయబడతాయని నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ జమ చేయకుండా పరిపాలనాపరమైన, సాంకేతికపరమైన అనుమతులు పొందకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్ల ప్రక్రియను ప్రారంభింకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను జిల్లా దేవదాయ శాఖ అధికారికి, ఆలయ ఎగ్జిక్యూటివ్ అఽథారిటీకి, ఇంజనీరింగ్ అధికారులకు పంపినట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది.