సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:08 AM
Allocation of funds for the ‘Purvodaya’ scheme దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పూర్వోదయ’ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన నిధులను.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలో కీలకమైన ప్రాజెక్టులకు మళ్లించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది.
‘పూర్వోదయ’ పథకం నిధుల కేటాయింపు
వంశధార, మహేంద్రతనయ, మడ్డువలస పనులకు మోక్షం
శ్రీకాకుళం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పూర్వోదయ’ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన నిధులను.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలో కీలకమైన ప్రాజెక్టులకు మళ్లించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో వంశధార, మహేంద్రతనయ, మడ్డువలస వంటి కీలక ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తూ అంచనాలు రూపొందించారు. ఈ నిధులు మంజూరై పనులు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం కానుంది. లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు, కొత్తగా వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.
సిక్కోలుకే సింహభాగం...
‘పూర్వోదయ’ పథకం కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.4,100 కోట్లతో అంచనాలు రూపొందించగా.. అందులో అత్యధిక వాటా శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టులకే దక్కడం విశేషం. జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ‘మహేంద్రతనయ ఆఫ్‌షోర్’ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 506.68 కోట్లు కేటాయించారు. దీనిద్వారా కొత్తగా 24,600 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే వంశధార ప్రాజెక్టు (ఫేజ్-2, స్టేజ్-2) పనులకు రూ. 171.91 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే అదనంగా 20వేల ఎకరాలకు నీరు అందుతుంది. ‘గొట్టాబ్యారేజీ- హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం’ కోసం రూ. 176.35 కోట్లు కేటాయించారు. దీనివల్ల 2,11,364 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది.
వంశధార-నాగావళి అనుసంధానం కోసం రూ. 72.5 కోట్లు ప్రతిపాదించారు. దీనివల్ల 5,000 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 18,527 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.
మడ్డువలస రిజర్వాయర్ రెండో దశ పనులకు రూ. 30.04 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 7,300 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది.
జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరందించే తోటపల్లి బ్యారేజీ అభివృద్ధికి రూ.263.36కోట్లు ప్రతిపాదించారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పెద్దపీట
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ తొలిదశకు అత్యధికంగా రూ. 1872.2 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో కూడా భారీగా సాగునీటి ప్రయోజనం చేకూరనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుల వారీగా నిధులు ఇలా..
-------------------------------------------------------------
ప్రాజెక్టు పేరు అంచనా (రూ.కోట్లలో) ప్రయోజనం (ఎకరాల్లో)
------------------------------------------------------------
మహేంద్రతనయ ఆఫ్‌షోర్ 506.68 24,600 (కొత్త ఆయకట్టు)
తోటపల్లి బ్యారేజీ 263.36 47,188 (కొత్త ఆయకట్టు)
వంశధార (ఫేజ్-2, స్టేజ్-2) 171.91 20,000 (కొత్త ఆయకట్టు)
గొట్టా బ్యారేజీ ఎత్తిపోతలు 176.35 2,11,364 (స్థిరీకరణ)
వంశధార-నాగావళి లింక్ 72.50 23,527 (మొత్తం)
మడ్డువలస (రెండో దశ) 30.04 7,300 (కొత్త ఆయకట్టు)