సాగునీటి కాలువలకు మహర్దశ
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:28 AM
జిల్లాలోని సాగునీటి కాలువలకు మహర్దశ పట్టింది. ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
- ‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి పనులు
- ముమ్మరంగా పూడిక, పిచ్చిమొక్కల తొలగింపు
- తీరనున్న సాగునీటి కష్టాలు
- 2న ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల
నరసన్నపేట, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సాగునీటి కాలువలకు మహర్దశ పట్టింది. ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కాలువల్లో పూడిక, పిచ్చిమొక్కల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలు తప్పనున్నాయని శివారు ప్రాంత రైతాంగం ఆనందం వ్యకచేస్తోంది. జూలై 2న వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడిచిపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో పరిస్థితి..
గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభంకావడంతో ఎటువంటి పనులు చేయలేకపోయారు. అయితే, ఈ ఏడాది ముందస్తు ప్రణాళికతో సాగునీటి కాలువలు, చెరువుల్లో పూడికతీత, తుప్పలు తొలగింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పనులు చేపడుతున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో 3,389 పనులను గుర్తించి 70శాతం మేరకు చేపట్టారు. త్వరలో మిగతా పనులు కూడా పూర్తికానున్నాయి. అలాగే, దెబ్బతిన్న సూయిజ్‌లు, మదుములను బాగు చేసేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కాంపోనెంట్ నిధులతో ఇరిగేషన్ అధికారులు అంచనాలు సిద్ధం చేయగా వాటికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.7 కోట్లు
జిల్లాలో 62 పనులకు గాను రూ.7.01 కోట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరయ్యాయి. ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, శ్రీకాకుళం, ఆమదాలవలస, గార, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఈ పనులు చేయనున్నారు. నరసన్నపేట వంశధార సబ్ డివిజన్ పరిఽధిలో 15 పనులకు రూ.3.41 కోట్లు, టెక్కలి సబ్‌డివిజన్ పరిధిలో 25 పనులకు రూ.1.65 కోట్లు, హిరమండలం సబ్ డివిజన్ పరిఽధిలో 19 పనులకు రూ.1.75 కోట్లు, ఆమదాలవలస సబ్‌డివిజన్ పరిధిలో మూడు పనులకు రూ.19.78 లక్షలు నిధులు వచ్చాయి. మరోక వైపు వంశధార కాలువల్లో ఇతర పనులకు ప్రభుత్వం మరో రూ.6 కోట్లు వరకు మంజూరు చేసింది. దీంతో జిల్లాలోని వంశధార కాలువల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. నరసన్నపేట వంశధార సబ్ డివిజన్ పరిఽధిలో 33 పనులకు రూ.1.30 కోట్లు నిధులు మంజూరు కాగా ఇప్పటికే 22 పనులు పూర్తి చేశారు. ఆపరేషన్ మెయింట్‌నెస్ , నేరేగా నిధులతో మరో 5 పనులు పూర్తి చేశారు.
గత ప్రభుత్వంలో ఇబ్బందులు
గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి కాలువలను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కాలువల్లో తట్టెడు మట్టికూడా తీయకపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక రైతన్నలు ఎన్నో అవస్థలు పడ్డారు. ఐదేళ్ల పాటు కాలువల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు దట్టంగా ముళ్ల తుప్పలు పెరిగిపోయాయి. దీనివల్ల కాలువల్లో నీటి ప్రవాహం సక్రమంగా జరగక, చివరి భూములకు నీరందేది కాదు. చెక్‌డ్యాములు, ఆనకట్టలకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు అందక రైతులు అవస్థలు పడేవారు. రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఇరిగేషన్, వంశధార అధికారులు ఏటా నిధులు కోసం ప్రతిపాదనలు చేయడం, వాటిని జగన్ సర్కారు బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో అన్నదాతులు విసిగిపోయి, శ్రమదానంతో పూడికలు తొలగించుకునే పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారికి కష్టాలు తప్పాయి.
90శాతం మేర పూర్తి
నరసన్నపేట వంశధార సబ్ డివిజన్ పరిధిలో 90 శాతం మేర పనులు పూర్తి చేశాం. కొన్ని ప్రాంతాల్లో మదుములు నిర్మించాం. శివారు ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా పూడిక తీత పనులు చేపట్టాం.
- కె.రామలక్ష్మి, డీఈఈ, నరసన్నపేట
శివారు భూములకు సాగునీరు
ఉపాధి హామీ వేతనదారుల ద్వారా వంశధార కాలువల్లో పూడిక తీత పనులు చేపడుతున్నారు. చిన్నచిన్న పనులను కాంపోనెంట్ నిధులతో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది శివారు భూములకు సాగునీరు అందనుంది.
-శిమ్మ చంద్రశేఖర్, నరసన్నపేట డీసీ చైర్మన్