Share News

బీలకు మహర్దశ

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:17 AM

బీల ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో విస్తరించి ఉన్న వేలాది ఎకరాల చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

బీలకు మహర్దశ
సోంపేటలోని బీల భూములు

- చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు

- పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం

- పెద్దమొత్తంలో వెచ్చించనున్న నిధులు వె

- హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

సోంపేట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బీల ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో విస్తరించి ఉన్న వేలాది ఎకరాల చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చిత్తడి నేలలను అనుసంధానిస్తూ భారీ పర్యాటక ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకుంది. కారిడార్‌గా అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలని తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. దీంతో స్థానికుల నుంచి హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ బీల నేపథ్యం..

సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో విస్తరించి ఉన్న బీల ప్రాంతంలో 800 హెక్టార్ల పరిధిలో విశిష్ట చిత్తడి నేలలు ఉన్నాయి. ఇక్కడి సహజ సిద్ధ జలాశయాలతో ఏడాది పొడవునా నీటి నిల్వలు ఉంటాయి. 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 32వేల ఎకరాల కొబ్బరి తోటలకు భూగర్భ జలాలు అందుతాయి. 1.5లక్షల మంది తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. బీలలో బొగ్గు ఆధారిత థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 2007లో అప్పటి ప్రభుత్వం ఎన్‌సీసీ సంస్థకు భూమిని కేటాయించింది. 33 గ్రామాల మధ్యలో ఉన్న 973 ఎకరాలకు గాను 600 ఎకరాలు సేకరించింది. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2008లో ఉద్యమం మొదలైంది. 2010 జూలై 14న వేలాది మంది పోలీసులతో వచ్చి థర్మల్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేసేందుకు ప్రయత్నించగా బీల ప్రజలు అడ్డుకున్నారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు రైతులు అమరుల య్యారు. ఈ క్రమంలో అప్పటి ప్రతి పక్షనేత చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో పర్యటించి ఇక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే థర్మల్‌ జీవో 1107ను రద్దు చేశారు.

పవన్‌ హామీతో..

2018 మే 21న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బీలలో పర్యటించారు. పర్యావరణాన్ని కాపాడి, బీలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2011లో ఆరు నెలలపాటు కేంద్ర బృందాలు కూడా బీలలో పర్యటించి ఇక్కడి నేలలను విశిష్ట చిత్తడి నేలలుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేశాయి. తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాష్ట్రంలోని చిత్తడి నేలల పరిరక్షణ కోసం రాష్ట్ర వెబ్‌ల్యాండ్‌ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో విస్తరించి ఉన్న వేలాది ఎకరాల చిత్తడి నేలలను అనుసంధానిస్తూ భారీ పర్యాటక ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అటవీశాఖ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలని డిసైడ్‌ అయ్యారు. పెద్దబీల, చిన్నబీల, తంపర భూములు, చిత్తడి నేలలను కారిడార్‌గా అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలని ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈప్రాంతానికి ఎంతగానో మేలు జరగనుంది. చిత్తడి నేలల పరిరక్షణతో పాటు పర్యాటక రంగం అభివృద్ధికి కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. పెద్దమొత్తంలో నిధులు వెచ్చింది ఈప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆస్కారం ఉంటుంది.

బీల ఎంతో ప్రత్యేకం..

2011లో ఆరు నెలలపాటు కేంద్ర బృందం సభ్యులు బీలలో పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. వారి నివేదిక ప్రకారం.. ‘బీల మూడు రకాలు. చిన్నబీల, పెద్దబీల, తంపరగా ఉన్నాయి. పెద్దబీల మిగతా రెండింటితో అనుసంధానంగా ఉంటుంది. తంపర సముద్రానికి దగ్గరా ఉంటుంది. సోంపేట మండలం బారువ నుంచి కవిటి మండలం కపాసుకుద్ది వరకు తీరం వెంబడి మొత్తంగా 20 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ చిత్తడి నేలలు దాదాపు 4వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. బీలలో 493 రకాల మొక్కలు, చెట్లు, 149రకాల పక్షులు ఉన్నాయి. జిల్లాలోనే 74శాతం వృక్షజాతులు, 52 శాతం పక్షులు ఈ ప్రాంతం కలిగి ఉంది. అంతరించపోతున్న జాబితాలో ఉన్న కామన్‌పోచర్డ్‌ అనే పక్షిని 2016 డిసెంబరు 15న కవిటి బీల ప్రాంతంలో గుర్తించారు. 10 శాతం చిత్తడినేలల్లో 1500వరకు నీటి పక్షులు కనిపించాయి. శీతాకాలంలో 20వేలకు పైగా నీటిపక్షులు ఉంటాయి. పొలాల గట్లపై 46రకాల సీతాకోక చిలుకలు, 24రకాల తుమ్మెదలను గుర్తించారు.’ ఇలా బీల ప్రాంతంలో వైవిధ్యమైన చెట్లు, మొక్కలు, పక్షులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పొందుపరిచారు.

Updated Date - Oct 20 , 2025 | 12:17 AM