Ground water: మ్యాజిక్ డ్రెయిన్లు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:32 PM
Wherever the water goes, it goes into the ground వర్షం పడితే చాలు కొన్ని గ్రామాల్లో వరదనీరు నిలిచిపోతుంది. కాలువలు సక్రమంగా లేక మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇక నుంచి వారికి ఆ కష్టాలు ఉండవు. తక్కువ ఖర్చుతో గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు.
ఎక్కడి నీరు అక్కడే భూమిలోకి
తక్కువ ఖర్చుతో నిర్మాణం
తప్పనున్న మురుగు కష్టాలు
పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు పంచాయతీలు ఎంపిక
ఇది మెళియాపుట్టి మండలం కొసమాళ పంచాయతీలోని బీసీ కాలనీ(పైచిత్రం). కాలువలు సక్రమంగా లేక ఇటీవల కురిసిన వర్షానికి నీరు ఇలా వీధిలో నిలిచిపోయింది. ఈ గ్రామంలో సుమారు 709 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2,254 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో పూర్తిగా కాలువలు లేవు. వర్షపు నీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. ఎక్కడ చూసినా బురదమయంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇళ్లలోకి మురుగునీరు చేరుతుంటుంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. గత వైసీపీ పాలనలో పంచాయతీల నిధులు దారిమళ్లాయి. ఎక్కడా తట్టెడు సిమెంట్ పని జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొంతమంది టీడీపీ నాయకులు కొసమాళ పంచాయతీ పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ఇటీవల అధికారులు భూమిపూజ చేశారు. దీంతో పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెళియాపుట్టి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వర్షం పడితే చాలు కొన్ని గ్రామాల్లో వరదనీరు నిలిచిపోతుంది. కాలువలు సక్రమంగా లేక మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇక నుంచి వారికి ఆ కష్టాలు ఉండవు. తక్కువ ఖర్చుతో గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. ఎక్కడి నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా చేయడమే ఈ మ్యాజిక్ డ్రెయున్ల ప్రత్యేకత. పైలెట్ ప్రాజెక్టు కింద మొదటి విడతగా జిల్లాలోని రణస్థలం మండలం తిరుపతిపాలెం, జి.సిగడాం మండలం మెట్టవలస, మెళియాపుట్టి మండలం కొసమాళ, శ్రీకాకుళం మండలం శ్రీపురం(సానివాడ) పంచాయతీలు ఎంపికయ్యాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు వినియోగించి ఈ పంచాయతీల్లో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
పెరగనున్న భూగర్భ జలాలు..
గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. పారిశుధ్యాన్ని పూర్తిగా వదిలేసింది. కొన్ని గ్రామాల్లో కాలువలు లేక రోడ్డపైనే మురుగు నీరు పారుతోంది. దీంతో తాగునీరు సైతం కలుషితమై గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సమస్య పరిష్కారానికి మ్యాజిక్ డ్రెయున్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటివల్ల మురుగు నీటి సమస్య పరిష్కారం కావడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరగనున్నాయి. సీసీ కాలువల నిర్మాణానికి 100 మీటర్లకు గాను రూ.4లక్షలు ఖర్చయితే మ్యాజిక్ డ్రెయున్ నిర్మాణానికి కేవలం రూ.90వేలు మాత్రమే అవుతుంది. సిమెంట్ రహదారి పక్కన డ్రెయిన్ కోసం అరమీటరు వెడల్పు, రెండు మీటర్ల లోతున గొయ్యితీస్తారు. అందులో 75 నుంచి 100 ఎంఎం పరిమాణం ఉన్న సాధారణ రాళ్లు వేస్తారు. వాటిపై మూడు పొరలుగా కంకర పిక్కలు వేస్తారు. కాలువలో ప్రతి 30 మీటర్లకు ఒక సోక్‌పీట్ (గుంత) ఏర్పాటు చేసి, అందులో వివిధ పరిమాణాల్లో ముక్కరాయి వేస్తారు. దీనివల్ల ఎంత నీరైనా మాజ్యిక్ డ్రెయిన్‌లోకి వెళ్లి అక్కడే భూమిలోకి ఇంకుతుంది. ఫలితంగా మురుగునీటి సమస్య పరిష్కారం కావడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి.
ఐదేళ్లు ఇబ్బందులు పడ్డాం
వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ మా పంచాయతీకి వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలియలేదు. మా గ్రామ సమస్యను కేంద్రమంత్రి రామోహ్మన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో మొదటి విడతగా మ్యాజిక్ డ్రెయున్ల నిర్మాణానికి మా గ్రామాన్ని ఎంపిక చేశారు. మురుగునీరు లేని గ్రామంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది.
-బొచ్చు ప్రసాదరావు, కొసమాళ
తక్కువ ఖర్చుతో రెండు ఉపయోగాలు
తక్కువ ఖర్చుతో నిర్మించనున్న మ్యాజిక్ డ్రెయున్లతో రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి గ్రామంలో మురుగునీరు కనిపించకుండా చేయడం, రెండోది భూగర్బ జలాలు పెంచడం. వీటి నిర్మాణానికి ఉపాధిహామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు వినియోగిస్తాం. ఇటీవల కొసమాళ గ్రామంలో పనులు ప్రారంభించేందుకు భూమిపూజ కూడా చేశాం.
- టి.రవి, ఏపీవో, మెళియాపుట్టి