Share News

Online betting: బెట్టింగుల్లో నష్టపోయి.. దొంగగా మారి..!

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:52 PM

Betting Loss ఆ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడాడు. రూ.1.10 లక్షల వరకూ పోగొట్టుకున్నాడు. మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకునేందుకు చైన్‌స్నాచర్‌గా మారాడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మేసి.. ఆ డబ్బులతో మళ్లీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడుతున్నారు. చివరికు పోలీసులకు దొరికిపోయాడు.

Online betting: బెట్టింగుల్లో నష్టపోయి.. దొంగగా మారి..!
మాట్లాడుతున్న డీఎస్పీ వెంకట అప్పారావు

  • ఆన్‌లైన్‌లో ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు

  • మళ్లీ ఆడేందుకు చైన్‌స్నాచర్‌గా మారిన వైనం

  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

  • పలాస, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఆ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడాడు. రూ.1.10 లక్షల వరకూ పోగొట్టుకున్నాడు. మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకునేందుకు చైన్‌స్నాచర్‌గా మారాడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మేసి.. ఆ డబ్బులతో మళ్లీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడుతున్నారు. చివరికు పోలీసులకు దొరికిపోయాడు. సోమవారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ వి.వెంకట అప్పారావు ఈ వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పురుషోత్తపురానికి చెందిన బంగారు బండి ప్రదీప్‌ అనే 19 ఏళ్ల యువకుడు విశాఖపట్నంలోని ఐటీఐలో చేరి సగంలోనే చదువుకు స్వస్తి పలికాడు. ఇంటివద్దే ఖాళీగా ఉంటూ ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ, బెట్టింగులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో రూ.1.10 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఆ విషయం తెలియకుండా దొంగతనం చేసి ఆ డబ్బులు రాబట్టుకునేందుకు పథకం రచించాడు. ఈ నెల 12న కోసంగిపురానికి చెందిన దుంపల యశోద అనే వృద్ధురాలికి రహదారిపై లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆమె మెడలో బంగారు ఆభరణాలు లాక్కుని ఉడాయించాడు. ఈ బంగారాన్ని పలాస రైల్వేకాలనీలో నివాసం ఉంటున్న రుసువా కిరణ్‌కుమార్‌కు ఇవ్వగా.. దాన్ని కాశీబుగ్గ రెల్లివీధికి చెందిన పవర్‌ రంజిత్‌కు అమ్మకానికి ఇచ్చారు. రూ.1.77 లక్షలకు వాటిని అమ్మారు. ఇందులో కిరణ్‌కుమార్‌కు రూ.27వేలు ఇవ్వగా, మిగిలిన రూ.1.50 లక్షలు ప్రదీప్‌ తీసుకున్నాడు. ప్రదీప్‌ తన వాటాకు వచ్చిన నగదు కూడా ఆన్‌లైన్‌ బెట్టింగులో పోగొట్టుకున్నాడు. దీంతో పలాసలో బాబాయి వరసైన కిరణ్‌కుమార్‌ వద్దకు వెళ్లి రూ.10వేలు కావాలని అడిగాడు. బాధిత మహిళ తన ఆభరణాలు పోయాయంటూ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు గాలిస్తుండగా ప్రదీప్‌ పలాసలో తారసపడ్డాడు. అనుమానంతో అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో చైన్‌స్నాచింగ్‌ విషయాన్ని వెల్లడించాడు. నిందితుడిని అరెస్టు చేసి, పలాస కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ పి.సూర్యనారాయణ, సిబ్బందిని ఆయన అభినందించారు.

Updated Date - Mar 17 , 2025 | 11:52 PM