కొండలను కొల్లగొట్టి..!
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:05 AM
Excavations for gravel పలాస మండలం జగన్నాథపురం, రాజగోపాలపురం, లొద్దభద్ర గ్రామాల సరిహద్దులో ఉన్న అటవీ, రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్న కొండల్లో కంకరను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఆపై చదునుగా ఉన్న భూమిని పంట పొలాలుగా మార్చి సాగు చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్నా సచివాలయ సిబ్బంది కానీ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కానీ దృష్టి సారించకపోవడం చర్చనీయాంశమవుతోంది.
కంకర కోసం ఇష్టారాజ్యంగా తవ్వకాలు
ఆపై చదును చేసిన స్థలాల్లో.. సాగు
పలాస మండలంలో ఆరు నెలలుగా అక్రమాలు
పట్టించుకోని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు
పలాస, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పలాస మండలం జగన్నాథపురం, రాజగోపాలపురం, లొద్దభద్ర గ్రామాల సరిహద్దులో ఉన్న అటవీ, రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్న కొండల్లో కంకరను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఆపై చదునుగా ఉన్న భూమిని పంట పొలాలుగా మార్చి సాగు చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్నా సచివాలయ సిబ్బంది కానీ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కానీ దృష్టి సారించకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీని వెనుక అదృశ్యశక్తి ఎవరో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
అప్పట్లో ఒక పార్టీ నాయకులే ఈ తతంగాన్ని నడిపేవారు. ప్రస్తుతం ఇరు పార్టీల నాయకులు కలిసి కంకరను తవ్వుకుంటున్నారనే విమర్శలున్నాయి. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి చెందిన కొంతమంది వైసీపీ నాయకులు సొంత ఎక్స్‌కవేటర్లు, ట్రిప్పర్లతో కంకరను తరలిస్తున్నారు. రాత్రి 11 గంటలయితే చాలు కొండల్లో శబ్దాలతో ప్రజలు హడలిపోతున్నారు. రాజగోపాలపురం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు ఒకరు ఈ వ్యవహారాన్ని ప్రజలతో వెళ్లి స్వయంగా పరిశీలించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తాము సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా వెళ్లగలమని అధికారులు మౌనం దాల్చుతున్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన ్న మొత్తం నాలుగు కొండలను దిగువ భాగాన కంకర, రాళ్లను తవ్వి తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పర్ లోడు రూ.6వేల వరకూ విక్రయిస్తున్నారు. మట్టిని ఇళ్లకు, సొంతానికి తరలిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు, కానీ వ్యాపారం కోసం నిత్యం వందలాది ట్రిప్పర్లతో కంకర తరలిస్తు రూ.కోట్లు గడిస్తున్నారు. మరోవైపు కంకర తరలించిన ప్రాంతంలో కొంతమంది వరి తదితర పంటలు పండించుకుంటున్నారు. ఆ విధంగా కొండను సైతం ఆక్రమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి వద్ద ప్రస్తావించగా.. అర్ధరాత్రి సమయంలో కంకర తరలిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేలా సచివాలయాల సిబ్బంది, వీఆర్వోలకు తగు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.