Share News

Theft Incidents: తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:35 PM

Residential Crimes పలాస పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగల ముఠా చిక్కింది. ఆ ముఠా సభ్యులు పగలు ఇతర రాష్ట్రాల నుంచి లారీల్లో సరుకులు తీసుకువస్తుంటారు. రాత్రివేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతుండేవారు. గత నెలలో ఓ చోరీకి పాల్పడగా.. పలాస పోలీసులకు ముగ్గురు ముఠా సభ్యులు చిక్కారు.

Theft Incidents: తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మహేశ్వరెడ్డి, పోలీసులకు పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగలు

  • పగలు సరుకుల రవాణా.. రాత్రివేళ చోరీలు

  • పలాస పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

  • రూ.5.33లక్షల బంగారు ఆభరణాల స్వాధీనం

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): పలాస పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగల ముఠా చిక్కింది. ఆ ముఠా సభ్యులు పగలు ఇతర రాష్ట్రాల నుంచి లారీల్లో సరుకులు తీసుకువస్తుంటారు. రాత్రివేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతుండేవారు. గత నెలలో ఓ చోరీకి పాల్పడగా.. పలాస పోలీసులకు ముగ్గురు ముఠా సభ్యులు చిక్కారు. వారి నుంచి విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు.

  • జైలులో స్నేహం...

  • ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌ జిల్లా టీసీహెచ్‌-డెహ్రాడూన్‌లో అజాద్‌ కాలనీకి చెందిన నూర్‌హసన్‌(43), ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌ సిటీ శ్యామ్‌నగర్‌లో రెడ్డికాలనీకి చెందిన ఇర్షాన్‌ అహ్మద్‌(32), రాయ్‌పూర్‌ సిటీలో ఘాజీనగర్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ గాఫ్ఫర్‌(59) దొంగతనాల కేసుల్లో గతంలో జైలుకు వెళ్లారు. అక్కడ వీరి మధ్య స్నేహం కుదిరింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడటం.. పోలీసులకు చిక్కితే జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగివచ్చి మళ్లీ మరో రాష్ట్రంలో చోరీకి పాల్పడటం వీరివృత్తిగా చేసుకున్నారు. నూర్‌హసన్‌.. మరొక అంతరాష్ట్ర దొంగలముఠాతో కలసి హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో ఏకంగా 140 చోరీలకు పాల్పడ్డారు. ఇందులో మిగిలిన ముఠా పట్టుబడగా.. నూర్‌హసన్‌ మాత్రం తప్పించుకున్నాడు. జైలులో మరో స్నేహితులైన ఇర్షాన్‌ అహ్మద్‌, అబ్దుల్‌ గాఫ్ఫర్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో లారీలో తిరుగుతూ.. నేరాలకు పాల్పడుతుండేవారు. వీళ్లు దొంగిలించిన ఆభరణాలను ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రమే విక్రయించేవారు. నెల కిందట ఒడిశా నుంచి ఆంధ్రాకు జీడిపప్పు తదితర సరుకులు లారీలో రవాణా చేసేందుకు వీరు పని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా సోంపేట, ఇచ్ఛాపురం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో సరుకులను తీసుకువచ్చినట్లే వచ్చి.. ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఏకంగా 14 చోరీలు నిర్వహించారు. అందులో 85.49 గ్రాముల బంగారాన్ని, 3కిలోల 70 గ్రాముల వెండి.. మొత్తంగా రూ.12.93 లక్షల ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

  • ఈ ఏడాది మార్చి 14న రాత్రి కాశీబుగ్గలో ఇంటికి తాళం వేసి పాడి చంద్రశేఖరరావు కుటుంబంతో సహా బంధువుల పెళ్లికి వెళ్లారు. ఈ ఇంటిలో 3కిలోల 70 గ్రాముల వెండిని ముఠా సభ్యులు చోరీచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ప్రత్యేక బృందాలను ఎస్పీ ఆదేశాలతో నియమించారు. మంగళవారం వాహనాల తనిఖీల్లో భాగంగా గొప్పిలి వైపు సీజీ04 ఎన్‌క్యూ.5609 నంబరుగల లారీపై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా.. లారీని ఆపి పోలీసులు తనిఖీ చేశారు. చోరీకి గురైన రూ. 5.33 లక్షలు విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు అంతరాష్ట్ర దొంగల ముఠాగా నిర్ధారించారు. నిందితులను అరెస్ట్‌ చేసి జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో 32 కేసుల్లో నిందితులు ఇంకా అరెస్ట్‌ కావాల్సి ఉందని తెలిపారు. ముఠాను పోలీసులను అభినందించారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ వెంకటఅప్పారావు, సీఐ సూర్యనారాయణ, సీసీఎస్‌ సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్‌ఐ మధుసూధనరావు, ఫింగర్‌ప్రింట్‌ ఎస్‌ఐ భరత్‌, కాశీబుగ్గ స్టేషన్‌ హెచ్‌సీలు శ్రీనివాస్‌, గవరయ్య, పీసీలు ఉషాకిరణ్‌, కోదండరావు, నీలకంఠం, సీసీఎస్‌ పీసీలు మాధవరావు, ఉమామహేశ్వరరావును అభినందించి ప్రశంసించారు.

Updated Date - Apr 15 , 2025 | 11:35 PM