police : బాధితుల మొర వింటూనే.. ఫిర్యాదు రాసిస్తూ..
ABN , Publish Date - May 20 , 2025 | 12:30 AM
Victims' appeals Ignored complaints పోలీసు వ్యవస్థలో ప్రయోగాత్మకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సమర్ధవంతమైన, పారదర్శక సేవలు అందించాలని నిర్ణయించింది.
పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం
ఇక ఏఐ ద్వారా సేవల వినియోగానికి చర్యలు
పలాస, మే 19(ఆంధ్రజ్యోతి): పోలీసు వ్యవస్థలో ప్రయోగాత్మకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సమర్ధవంతమైన, పారదర్శక సేవలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ వ్యవస్థ ద్వారా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కాగా.. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 175 పోలీసుస్టేషన్లలో అమలు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏఐ ప్రత్యేకత ఏంటంటే.. బాధితుల మొర వింటూనే ఫిర్యాదును రాసి ఇచ్చేస్తుంది. నేరాన్ని బట్టి ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాల్సిన సెక్షన్లు ఇట్టే చెప్పేస్తుంది. నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాల సేకరణ నుంచి దర్యాప్తు దారి చెప్పడంతో పాటు డిఫెన్స్ లాయర్ ఏమి వాదిస్తారో చెబుతూనే కౌంటర్ కూడా సూచిస్తుంది. బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో చార్జిషీట్ వరకూ అంతా ఏఐతోనే నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. మొదటిగా పోలీసుశాఖ నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఒక పోలీస్‌స్టేషన్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా.. మంచి ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో కూడా దీన్ని అమలు చేయడానికి పోలీస్‌స్టేషన్లు సిద్ధం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఏఐ సాంకేతికతను వినియోగించుకోవచ్చు. ప్రతి జిల్లాలో 35 పోలీస్‌స్టేషన్ల వరకూ ఏఐని ప్రవేశపెట్టాలని పోలీసుశాఖ భావిస్తోంది.
ఏఐ పనితనం ఇలా..:
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు రాయడానికి రైటర్ సహాయం తీసుకుంటారు. ఒక్కోసారి బాధితునికే అవి అర్థం కాని పరిస్థితి ఉంది. విచారణకు వచ్చే సమయానికి బాధితునికి తన బాధ తప్ప.. ఫిర్యాదులో ఏవి ఉన్నాయో గుర్తు ఉండదు. కొన్నిసార్లు ఫిర్యాదుదారులు చెప్పిన దానికి, కాగితంపై ఉన్నదానికి పొంతన కూడా ఉండని పరిస్థితి. ఈ కారణంగా కోర్టులో కేసు ఓడిపోయే సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. దీన్ని సరిచేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని గుర్తించిన పోలీసుశాఖ.. ఏఐ సేవలు అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. భాష, ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు, నేర ఆధారాలు నిర్దేశం చేయడం, ఫోరెన్సిక్ ట్రిప్స్, ప్రాసిక్యూషన్ ట్రిప్స్, చార్జిషీటులో లోపాలు సవరణ చేయడం, డిఫెన్స్ న్యాయవాది వాదనలు ఎదుర్కొనవలసిన తీరును సైతం నిర్దేశం చేస్తుంది. దీనివల్ల నేరాలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసుశాఖ భావిస్తోంది. జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి, కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురం, పాతపట్నం పోలీసుస్టేషన్ల పరిధిలో ఏఐని అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించింది.
ఎక్కడ వినియోగించాలో అక్కడ...
ఏఐని ఎక్కడ వినియోగించాలో అక్కడ ఉపయోగిస్తున్నాం. ఇప్పటికే మాకు తగిన ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం సబ్‌డివిజన్‌లో ఇచ్ఛాపురం, సోంపేట, కాశీబుగ్గ పోలీస్టేషన్లలో అమలు చేస్తున్నాం. నేర పరిశోధనకు ఏఐ ఎంతో వినియోగపడుతుంది. నిందితులు తప్పించుకోవడానికి వీలులేకుండా కేసులు పెట్టవచ్చు. కచ్చితమైన ఆధారాలు సేకరణకు సహకారం అందిస్తుంది. మొత్తం అమలులోకి వస్తే పని సులభతరం అవుతుంది.
- వి.వెంకట అప్పారావు, డీఎస్పీ, కాశీబుగ్గ