డిగ్రీ అడ్మిషన్లకు లైన్ క్లియర్
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:58 PM
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఎట్టకేలకు లైన్‌క్లియిర్ అయింది.
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
- సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుల విధానంపై స్పష్టత కరువు
నరసన్నపేట, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఎట్టకేలకు లైన్‌క్లియిర్ అయింది. ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడగా, మూడు నెలల తరువాత డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కొన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మిషన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 101 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్, సోషల్ వర్క్, కామర్స్, కంప్యూటర్ సైన్సు సబ్జెక్టుల్లో బీఏ, బీఎస్సీ, బీకాం అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రవేశాలకు ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించేవారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే కళాశాలలు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరించిన ప్రిన్సిపాల్ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. ప్రతి ఏటా అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో సుమారు 12వేల మందికి పైగా విద్యార్థులు చేరేవారు. అయితే, ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావడం, ఇంటర్‌లో ఉత్తీర్ణత తగ్గడం, సైన్సు విద్యార్థులు ఇంజనీరింగ్‌పై మొగ్గు చూపడం వంటి కారణాలతో అడ్మిషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసే విద్యార్థులు వారు చేరే కళాశాల, అక్కడి కోర్సులను ప్రథమ ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. రిజర్వుడు కేటగిరీ విద్యార్థులకు వారి రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ విద్యార్థులకు మొత్తం సీట్లలో 15శాతం కేటాయిస్తారు. ఈ రిజర్వేషన్లను వర్గీకరణ ప్రకారం అమలు చేస్తారు. సింగిల్ మేజర్ సబ్జెక్టు, డబుల్ మేజర్ సబ్జెకు విషయంలో ఇంకా ఉన్నత విద్యామండలి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంతో విద్యార్థులకు తీవ్రస్థాయిలో నష్టం ఏర్పడుతుందని, డబుల్ మేజర్ సబ్జెక్టు విధానం అమలు చేయాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఉన్నత విద్యాశాఖ మాత్రం పాత విధానం మాదిరిగానే సింగిల్ సబ్జెక్టు విధానానికి మొగ్గు చూపింది. దీంతో ఈనెల 21న ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.