Share News

ప్రాణాలు తీసిన పిడుగులు

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:30 AM

జిల్లాలో శనివారం పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు.

ప్రాణాలు తీసిన పిడుగులు
సింహాచలం మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

- జిల్లాలో ఇద్దరి మృతి

కొత్తూరు/సరుబుజ్జిలి, మే 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. కొత్తూరు మండలం ఆకులతంపర కాలనీకి చెందిన పెయ్యిల సింహాచలం(79) అనే వృద్ధుడు శనివారం సాయంత్రం మేకలను తోలుకుని గ్రామ సమీపంలోని పొలాల వైపు వెళ్లాడు. అయితే, ఒక్కసారిగా మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి సింహాచలం నిల్చొన్నాడు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో సింహాచలం అక్కడికక్కడే మృతి చెందాడు. మేకలను తోలుకెళ్లిన భర్త ఎప్పటికీ రాకపోవడంతో భార్య పున్నాలు తన బంధువులతో కలిసి పొలాలకు వెళ్లి చూడగా సింహాచలం విగతజీవిగా పడిఉన్నాడు. దీంతో బోరున విలపించింది. సింహాచలానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు వలస కూలీలుగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. సింహాచలం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై స్థానికులు కొత్తూరు పోలీసులు, తహసీల్దార్‌కు సమాచారాన్ని అందజేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీ తెలిపారు.


బుడ్డివలసలో..

సరుబుజ్జిలి మండలం బుడ్డివలస గ్రామానికి చెందిన బూరాడ అప్పలనాయుడు (55) అనే వ్యక్తి శనివారం పిడుగు పడి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పలనాయుడు సాయంత్రం 4.30 గంటల సమయంలో తన పొలానికి వెళ్లాడు. ఇంతలో ఒకేసారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పొలం పని చేసుకుంటున్న అప్పలనాయుడుపై చలి పిడుగు పడింది. దీంతో అతని శరీరమంతా చల్లబడిపోయి స్పృహ కోల్పోయాడు. గ్రామస్థులు సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదన్‌, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ పీహెచ్‌సీని సందర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పలనాయుడుకు భార్య సావిత్రమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరుబుజ్జిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

31-sarubujjili-12.gif

అప్పలనాయుడు (ఫైల్‌)

Updated Date - Jun 01 , 2025 | 12:30 AM