Lightning Strike: పండుగ వేళ.. పిడుగు
ABN , Publish Date - May 21 , 2025 | 12:27 AM
Weather Alert.. Thunderstorm గ్రామదేవత సంబరాలతో అప్పటి వరకూ ఆ ఇళ్లంతా కళకళలాడింది. కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా కనిపించింది. అటువంటి పండుగ వేళ.. ఆ ఇంట ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించి.. నాగావళి నది తీరాన మేకపోతు పొట్టు మాంసాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో తండ్రి అక్కడక్కడే మృతి చెందగా.. కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నాగావళి తీరంలో దుర్ఘటన
తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
బూబమ్మనగర్‌లో విషాదం
శ్రీకాకుళం క్రైం, మే 20(ఆంధ్రజ్యోతి): గ్రామదేవత సంబరాలతో అప్పటి వరకూ ఆ ఇళ్లంతా కళకళలాడింది. కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా కనిపించింది. అటువంటి పండుగ వేళ.. ఆ ఇంట ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించి.. నాగావళి నది తీరాన మేకపోతు పొట్టు మాంసాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో తండ్రి అక్కడక్కడే మృతి చెందగా.. కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల రోదనతో అంతటా విషాదం అలుముకుంది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం నగరం బలగమెట్టు సమీపాన బూబమ్మనగర్‌కు చెందిన గేదెల రాజారావు (55) మంగళవారం ఉదయం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆయన కుమారుడు నాగార్జున కూడా పిడుగు శబ్దంలో ఉలిక్కిపడి అస్వస్థతకు గురయ్యాడు. బలగమెట్టు, బూబమ్మనగర్ ప్రాంతంలో భద్రమ్మతల్లి అమ్మవారి వారాలు మంగళవారం నిర్వహించారు. ఈ నేపఽథ్యంలో రాజారావు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అమ్మవారికి పసుపు కుంకుమ చెల్లించి.. మేకపోతును బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం బలగమెట్టు ప్రాంతంలో ఉన్న నాగావళి ఒడ్డుకు తండ్రీ కొడుకులు చేరుకున్నారు. అక్కడ మేకపోతు పొట్టు మాంసాన్ని శుభ్రం చేస్తుండగా ఒక్కసారి ఉరుములు మెరుపులతో పిడుగు పడింది. దీంతో రాజారావు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు నాగార్జునకు తీవ్ర గాయాలు కాగా.. అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి(రిమ్స్)కు నాగార్జునను తరలించారు. ప్రస్తుతం ఎఫ్‌ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ ఎస్‌ఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
గేదెల రాజారావు తాపీమేస్ర్తీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతవరకూ భద్రమ్మతల్లి సంబరాల్లో అందరితోనూ సరదాగా ఉన్న రాజారావు పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుమారుడు కూడా ఆస్పత్రి పాలవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికులు విషాదంలో మునిగిపోయారు. రాజారావు మృతిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నాగార్జునకు మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యాధికారులను మంత్రి అచ్చెన్న ఫోన్‌లో ఆదేశించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న మూడు రోజులు పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్న సూచించారు.