Share News

ప్రాణాలు తీస్తున్న సరదా

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:09 AM

ఈత సరదా ప్రాణాలు తీస్తుంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికో.. లేక సరదాగా స్నానం చేయడానికో సముద్రానికి వెళ్తున్న వారు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు.

ప్రాణాలు తీస్తున్న సరదా
శివసాగర్‌ తీరంలో పర్యాటకులు

- ఈత కోసం సముద్రానికి వెళ్తున్న యువత

- జాగ్రత్తలు పాటించకపోవడంతో గల్లంతై మృత్యువాత

- బీచ్‌ల వద్ద కానరాని ప్రమాద హెచ్చరిక బోర్డులు

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా ప్రాణాలు తీస్తుంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికో.. లేక సరదాగా స్నానం చేయడానికో సముద్రానికి వెళ్తున్న వారు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. దీనివల్ల కెరటాలకు గల్లంతై మృత్యువాత పడుతున్నారు. వీరిలో అధికంగా యువతే ఉండడం బాధాకరం. మంగళవారం, భావనపాడు తీరంలో సముద్ర స్నానం చేస్తుండగా అలల ఉధృతికి గల్లంతై ముగ్గురు డిప్లొమా విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లాలో అత్యధికంగా సుమారు 194 కిలోమీటర్ల పొడవున సముద్ర తీర ప్రాంతం ఉంది. పర్యాటకులను ఆకర్షించేందుకు కొన్ని తీరాల వద్ద అధికారులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే, పర్యాటకులు స్నానాల కోసం సముద్రంలోకి వెళ్లేటప్పుడు వారు తీసుకోవల్సిన తగు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భావనపాడు, శివసాగర్‌ తీరాల్లో గోతులు అధికంగా ఉండడంతోనే స్నానాలకు దిగిన వారు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఈ రెండు తీరాల్లో చిన్న కెరటాలకే ఇసుక మేటలు వేసి గోతులు ఏర్పడతాయని మత్స్యకారులు అంటున్నారు. స్నానాలకు దిగిన వారికి ఈ గోతులు కనిపించక, పైగా ఈత రాకపోవడంతో కెరటాలకు గల్లంతై మృతి చెందుతున్నారు. ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు బీచ్‌ల వద్ద కనీస హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి, మెరైన్‌, సివిల్‌ పోలీసులు సంయుక్తంగా తీరాల్లో పర్యటించి పర్యాటకులకు అవగాహన కల్పించడంతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ, గత కొన్నేళ్లుగా వారు పట్టించుకోవడం లేదు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే బారువ, శివసాగర్‌, భావనపాడు, మొగదలపాడు, కళింగపట్నం, గనగళ్లవానిపేట, తదితర బీచ్‌ల వద్ద రక్షణ బోట్లు, జాకెట్లు రిజర్వుగా ఉంచాలని, దీనివల్ల కొంతమంది ప్రాణాలైన కాపాడే అవకాశం ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. భావనపాడు బీచ్‌ వద్ద మంగళవారం ముగ్గురు విద్యార్ధులు గోతుల్లో ఇరుక్కోని రక్షించాలని కేకలు వేసినా, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోయారని దూరంగా ఉన్న పర్యాటకులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం ఒక పోలీసు అయినా తీరంలో గస్తీ కాస్తే ప్రమాదాలు నివారించవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

జాగ్రత్తలు తీసుకోవాలి

సముద్రం, నదులు, చెరువులు స్నానాలకు వెళ్లే సమయంలో యువత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత రాకుండా అక్కడికి వెళ్లవద్దు. ఒక్క నిమిషం సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. కొన్ని దేశాల్లో పిల్లలకు చదువుతోపాటు ఈత నేర్పించడం కూడా ఒక భాగమే. కాలేజీలు, పాఠశాలల్లోనూ సముద్రం, నదుల ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనివల్ల వారు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

-డాక్టర్‌ కోదండరావు, పూండి

Updated Date - Aug 07 , 2025 | 12:09 AM