Share News

మహిళా చట్టాలతో వేధింపులను తిప్పికొడదాం

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:46 PM

Meeting with students at RGUKT campus బాలికలు, మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలతో వేధింపులను సమర్థవంతంగా తిప్పికొడదామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురం కొండపై ఉన్న ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ను ఆమె పరిశీలించారు.

మహిళా చట్టాలతో వేధింపులను తిప్పికొడదాం
ఇంజనీరింగ్‌ విద్యార్థినులతో మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ

- రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ

- ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో విద్యార్థినులతో సమావేశం

ఎచ్చెర్ల, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): బాలికలు, మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలతో వేధింపులను సమర్థవంతంగా తిప్పికొడదామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురం కొండపై ఉన్న ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ను ఆమె పరిశీలించారు. వేధింపుల ఫిర్యాదుపై స్పందిస్తూ.. ఇంజనీరింగ్‌ విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి.. పలు సూచనలు చేశారు. ‘బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా పోక్సో, ఫోష్‌ చట్టాలు ఉన్నాయి. కొన్నేళ్ల కిందట బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలు వేధింపులు ఎదుర్కొనేవారు. నేటి సమాజంలో పలు సంస్థల్లోనే బాలికలు, మహిళలపై వేధింపులు జరుగుతుండడం సభ్యసమాజానికి సిగ్గు చేటు. విద్యా సంస్థల్లో ఇలాంటి పోకడలు ఇటీవల పెరిగిపోయాయి. ఈ పద్ధతి మంచిది కాదు. విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగి చదువులు కొనసాగించాలి. మహిళా కమిషన్‌ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ప్రతి విద్యా సంస్థలోనూ అంతర్గత కమిటీలు(ఐసీసీ టీమ్‌) పనిచేస్తాయి. విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కలిగించేలా కార్యక్రమాలను నిర్వహిస్తాం. సురక్షిత వాతావరణంలో చదువుకునేలా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాల’ని శైలజ స్పష్టం చేశారు. అనంతరం క్యాంపస్‌ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి కూడా క్యాంపస్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ, ఏవో డాక్టర్‌ ముని రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:46 PM