vajrothava celebrations : వెనుకబడిన ముద్రను చెరిపేద్దాం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:51 AM
Development of the srikakulam ‘శ్రీకాకుళం జిల్లాకు 75 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ గడ్డ కోసం అనేకమంది పోరాటాలు, త్యాగాలు చేశారు. ఎందరో మహనీయులు వివిధ రంగాల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అయినా జిల్లా అభివృద్ధిలో మనం వెనుకబడి ఉన్నాం. ఇకపై ఆ ముద్రను చెరిపేద్దాం. ఉదయించే జిల్లాగా తీర్చిదిద్దుదామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు.
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళం జిల్లాకు 75 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ గడ్డ కోసం అనేకమంది పోరాటాలు, త్యాగాలు చేశారు. ఎందరో మహనీయులు వివిధ రంగాల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అయినా జిల్లా అభివృద్ధిలో మనం వెనుకబడి ఉన్నాం. ఇకపై ఆ ముద్రను చెరిపేద్దాం. ఉదయించే జిల్లాగా తీర్చిదిద్దుదామ’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని కేఆర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సర్దార్ గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రాజగోపాలరావు, ఎర్రన్నాయుడు వంటి మహనీయుల సేవలు చిరస్మరణీయం. రాజకీయాలు, వ్యాపారం, సాహిత్యం, శాస్త్రం, రక్షణ దళాలు వంటి అన్ని రంగాల్లోను జిల్లాకు చెందిన ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. సమష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం. జిల్లాలో ఎయిర్‌పోర్టు, పెద్ద పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు తీసుకురవడానికి సంకల్పించాం. ఇందుకు ప్రభుత్వాల కృషితోపాటు ప్రజల సహకారం కూడా అవసరమ’ని తెలిపారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘50ఏళ్ల జిల్లా ఆవిర్భావ ఉత్సవాల్లో ఎమ్మెల్యేగా, ఇప్పుడు వజ్రోత్సవాల్లో రాష్ట్రమంత్రిగా పాల్గొనడం ఆనందంగా ఉంది. ఎందరో మహానుభావుల కృషి వలన శ్రీకాకుళం గడ్డ పేరు నిలిచింది. జిల్లాలో వలసలు నివారించి.. ఇతరులు ఇక్కడకు ఉపాధికి వచ్చేలా అభివృద్ధి చేద్దామ’ని తెలిపారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రకృతి సంపద, విస్తార తీరప్రాంతం, నదుల కలయికతో శ్రీకాకుళం ప్రత్యేకమన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మూడురోజులపాటు వజ్రోత్సవాల కార్యక్రమాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ నేడు శ్రీకాకుళం జిల్లా దేశంలో ఒక గౌరవనీయ స్థానంలో నిలిచిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అనే పేరును తొలగించేందుకు పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు కీలకమని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, డీసీసీబీ చైర్మన్ చౌదరి అవినాష్ పాల్గొన్నారు.