మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:59 PM
Abhyudam Cycle Tour గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా రావాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్టి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపడుతున్న అభ్యుదయ సైకిల్‌యాత్ర.. మంగళవారం శ్రీకాకుళంలో విజయవంతంగా నిర్వహించారు.
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్టి
శ్రీకాకుళంలో ఉత్సాహంగా అభ్యుదయం సైకిల్‌యాత్ర
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా రావాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్టి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపడుతున్న అభ్యుదయ సైకిల్‌యాత్ర.. మంగళవారం శ్రీకాకుళంలో విజయవంతంగా నిర్వహించారు. డీఐజీతోపాటు కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో సాయి ప్రత్యూష, అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీఐజీ మాట్లాడుతూ.. ‘గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లనే సాధ్యమవుతుంది. ఏడాది కాలంలో రేంజ్ పరిధిలో సంకల్పం మిషన్, కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 21,206 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం. 16,321 గ్రామాలు/పట్టణాల్లో, 6,459 విద్యా సంస్థల్లో సంకల్పం కార్యక్రమాలు జరిగాయి. విద్యాసంస్థల వద్ద 388 డ్రాప్‌బాక్సులు, 4,094 ఈగల్ క్లబ్స్‌ను ఏర్పాటు చేశాం. ఈ నెల 29న ఇచ్ఛాపురంలో అభ్యదయం సైకిల్‌యాత్రలో భాగంగా భారీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం’ అని తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ గంజాయిని తరిమిక్టొడానికి సమిష్టి ప్రయత్నం నిరంతరం కొనసాగించాలన్నారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.. గంజాయి నిర్మూలనతోపాటు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమేనన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని 1932, 112 నెంబర్లకు లేదా స్థానిక పోలీసులకు అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ తిరుపతినాయుడు, ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, డీసీఎంఎస్ చైర్మన్ అవినాష్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.