Share News

Village name change: మా ఊర్ల పేరు మార్చండయ్యా!

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:14 AM

We can't bear the insults కొన్ని ఊర్ల పేర్లు వినటానికి వినసొంపుగా ఉంటాయి. వాటి పేర్లు చెప్పగానే అక్కడి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయి. కొంతమంది తమ గ్రామాల పేర్లను సగర్వంగా చెప్పుకుంటారు. అయితే, మెళియాపుట్టి మండలంలోని రెండు గ్రామాల ప్రజలు తమ ఊరి పేర్లను చెప్పుకోవాలంటే అవమానకరంగా భావిస్తున్నారు.

Village name change: మా ఊర్ల పేరు మార్చండయ్యా!
శ్రీకాకుళంలో డీఆర్వో వెంకటేశ్వరావుకు వినతిపత్రాన్ని అందజేస్తున్న సానిపాలెం గ్రామస్థులు

  • పలకాలంటేనే ఇబ్బందిగా ఉంటోంది

  • అవమానాలు భరించలేకపోతున్నాం

  • అధికారులకు రెండు గ్రామాల ప్రజల వినతి

  • మెళియాపుట్టి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కొన్ని ఊర్ల పేర్లు వినటానికి వినసొంపుగా ఉంటాయి. వాటి పేర్లు చెప్పగానే అక్కడి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయి. కొంతమంది తమ గ్రామాల పేర్లను సగర్వంగా చెప్పుకుంటారు. అయితే, మెళియాపుట్టి మండలంలోని రెండు గ్రామాల ప్రజలు తమ ఊరి పేర్లను చెప్పుకోవాలంటే అవమానకరంగా భావిస్తున్నారు. దీనికి కారణం ఆ ఊర్ల పేరులో అసభ్యకర పదం ఉండడమే. ఆ రెండు గ్రామాలే సానిపాలెం, సవర సానిపాలెం. పడ్డ పంచాయతీలో ఈ రెండు గ్రామాలు మారుమూల కొండలకు ఆనుకొని ఉన్నాయి. పర్లాఖిమిండి రాజవంశీయులు కొంతమంది ఈ ప్రాంతాల్లో ఒంపుడుగత్తెలను ఉంచి వారికి మాన్యం కింద వందలాది ఎకరాల భూములు ఇచ్చారు. దీనివల్ల పూర్వీకులు ఆ గ్రామాలకు సానిపాలెం, సవర సానిపాలెంగా పేరు పెట్టి పిలిచేవారు. అదే పేరు రికార్డుల్లో సైతం నమోదు చేసినట్లు ఆ గ్రామస్థులు తెలుపుతున్నారు. సానిపాలెంలో 220 కుటుంబాలు వరకు ఉన్నాయి. ఈ గ్రామానికి సమీపంలో కొంతమంది ఎస్టీ కులాలు వారు ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ గ్రామాన్ని సవర సానిపాలెంగా పిలుస్తున్నారు. అయితే, తమ ఊర్ల పేర్లను చెప్పడానికి అవమానకరంగా ఉంటుందని ఆ రెండు గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎవరైనా మీది ఏ ఊరు అని అడిగితే చెప్పలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోతున్నారు. ఆధార్‌, రేషన్‌ తదితర కార్డులతో పాటు విద్యార్థుల సర్టిఫికెట్లలో సైతం సానిపాలెంగా ముద్రిస్తుండంతో అవమానకరంగా ఉంటుందని తెలుపుతున్నారు. పిల్లలకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు. అయితే, ఇటువంటి గ్రామాల పేర్లతో పాటు సరిహద్దులు మార్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇటీవల ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తమ ఊర్ల పేర్లను మార్చాలని కోరుతూ తహసీల్దార్‌ బి.పాపారావుకు ఆ రెండు గ్రామాల ప్రజలు ఇటీవల వినతిపత్రం అందజేశారు. సానిపాలెం గ్రామం పేరును తొలగించి రామయ్యపాలెంగా మార్చాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తహసీల్దార్‌ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పేరు మార్పునకు చర్యలు చేపడతామన్నారు.

  • ‘మీ కోసం’లో కూడా..

  • గ్రామం పేరు మార్చాలని సానిపాలెం వాసులు సోమవారం శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక.. ‘మీ కోసం’ కార్యక్రమంలో కూడా అధికారులకు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామం పేరు ఎవరికైనా చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటోందని, రామయ్యపాలెంగా మార్చాలని కోరుతూ డీఆర్వో వెంకటేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఎం.ఎల్‌.ఎం.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

  • సిగ్గుగా ఉంటోంది..

  • మా గ్రామం పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంటోంది. ఊరు పేరు చెప్పి అవమానం పడుతున్నాం. కొందరు మావైపు చూసి నవ్వుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మా గ్రామం పేరు మార్చితే మంచిది.

  • - తొరగది ఆదిలక్ష్మి, సానిపాలెం

  • పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు

  • ఊరి పేరులో అసభ్యకర పదం ఉండడంతో దాన్ని చెప్పేందుకు మా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్లలకు సంబంధాలు రావడం లేదు. మా గ్రామం పేరు చెబితేనే చాలామంది పెళ్లి చూపులకు రాని పరిస్థితులు ఉన్నాయి.

  • - దేవాది ఢిల్లమ్మ, సానిపాలెం

  • అవమానాలు భరిస్తున్నాం

  • నేను పెయింటర్‌గా పని చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మా గ్రామం పేరు చెబితే మీ ఊరిలో వేశ్యలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. చాలా బాధగా ఉంటోంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. మా గ్రామం పేరు మార్చటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలి.

  • - మండల ఎల్లమ్మనాయుడు, సానిపాలెం

  • పూర్వం నుంచి ఇదే పేరు

  • మా తాతతండ్రుల నుంచి మా గ్రామానికి సానిపాలెంగా పేరు ఉంది. పూర్వం రాజులు పాలించిన కాలంలో మా గ్రామంలో ఒంపుడుగత్తెలను ఉంచడం వల్ల సానిపాలెంగా పేరువచ్చిందని మా పెద్దలు చెప్పేవారు. ఆ నాటి నుంచి నేటి వరకూ ఆ పేరు మారలేదు.

  • - బాగు దానయ్య, సానిపాలెం

  • రామయ్యపాలెంగా మార్చాలి

  • మా గ్రామానికి మంచి పేరు పెట్టాలని అందరం నిర్ణయించుకున్నాం. రామయ్యపాలెంగా నామకరణం చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈ పేరును పెట్టాలని అధికారులకు వినతిపత్రం అందించాం.

  • - దేవాది ప్రసాదరావు, సానిపాలెం

  • విచిత్రంగా చూస్తున్నారు..

  • మా ఊరి పేరు ఎవరికైనా చెబితే విచిత్రంగా చూస్తున్నారు. అందుకే కొన్నిసార్లు పాలెం గ్రామమని చెబుతున్నాం. మా గ్రామం పేరును అధికారులు రికార్డుల్లో తొలగించి రామయ్యపాలెంగా నమోదు చేయాలి.

  • -డి.పాపారావు, సానిపాలెం

Updated Date - Sep 02 , 2025 | 12:14 AM