వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుదాం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:02 AM
స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు.
20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్
శ్రీకాకుళం కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి వివిధ పథకాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019-2024 మధ్య ఉపాధిహామీ పనులకు సంబంధించిన వ్యయం, నష్టపోయిన నిధుల లెక్కలు వివరించారు. ఇందులో శతశాతం వేతనాల వినియోగం జరిగినట్లు లెక్కలు చూపించారు. కేవైసీ చేస్తే ఎంతమంది తగ్గారు? నిధులు ఎవరి జేబులలోకి వెళ్లాయి? అనే నిజాలు బయట పడతాయన్నారు. వేతనదారులకు 100 నుంచి 125 పని దినాలు కల్పించడం, రైతులకు సకాలంలో కూలీలను అందుబాటులో ఉంచాలన్నారు. మొత్తం 185 దినాల కూలీ దొరికేలా జిల్లాకు నిధులు తేవడానికి ప్రణా ళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బిల్లుల చెల్లింపులపై చైర్మన్‌కు కలెక్టర్ వివరించారు. అనంతరం మీడియాతో లంకా దినకర్ మాట్లాడుతూ... ఈ ఏడాది ఇంతవరకు 17,213 మంది శిశువులు ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించారని తెలిపారు. గర్భిణులకు అవసరమైన వైద్యం, మందులు అందజేసి ‘రక్తహీనత విముక్త భారత్’ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2025-26కు సంబం ధించి ఈ కార్యక్రమం అమలు బాధ్యతను ఐసీడీఎస్‌కు బదిలీ చేశామన్నారు. డా.ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రూ.380 కోట్లతో 2.11లక్షల మందికి చికిత్సలు అందించామని తెలిపారు. వీటితో పాటు మరికొన్ని పథకాల అమలు తీరును వివరించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలులో వేగం పెంచాలన్నారు. సమావేశంలో శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనిత, సీపీఓ లక్ష్మీప్రసన్న, మునిసిపల్ కమిషనర్ ప్రసాదరావు, డీసీ హెచ్‌ఎస్ డా.కల్యాణ్ బాబు, డ్వామా పీడీ లవరాజు, డీఈవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.