చట్టాలను కఠినంగా అమలు చేయాలి
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:57 PM
జిల్లాలో పౌరహక్కుల పరిరక్షణ, అట్టడుగు వర్గాల రక్షణ కోసం పీసీఆర్, పీవోఏ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పౌరహక్కుల పరిరక్షణ, అట్టడుగు వర్గాల రక్షణ కోసం పీసీఆర్, పీవోఏ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్, మానటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యాచార నిరోధక చట్టం (పీసీఆర్ అండ్ పీవోఏ యాక్ట్) అమలు అంశాలను అధికారులు సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అట్టడుగు వర్గాలపై జరిగే హింసాత్మక చర్యలను అరికట్టడంలో నిర్లక్ష్యానికి తావు లేదని హెచ్చరించారు. ‘ఏప్రిల్ నుంచి జూన్ వరకు 9 మంది బాధితులకు రూ.6,95,052 పరిహారం అందించాం. 11 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. జిల్లాలో ప్రస్తుతం పీవోఏ చట్టం కింద ప్రత్యేక కోర్టులో 267 కేసులు విచారణలో ఉన్నాయి. వీటిని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల 30న సివిల్ రైట్స్ డే నిర్వహించాలి. వారానికి ఒకసారి అధికారులు ఒక గ్రామాన్ని సందర్శించి, ఆలయ ప్రవేశం, నీటి వనరుల వినియోగం, వేరు గ్లాస్ వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించాలి. ఇందులో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, సంక్షేమ శాఖ అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలి.’ అని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, పలువురు డీఎస్పీలు, కమిటీ సభ్యులు తోట రాములు, దండాశి రాంబాబు, దాసరి తిరుమలరావు, అప్పన్న, గేదెల రమణమూర్తి, రాజు, శాంతారావు, ఎస్.ప్రభాకరరావు, వి.దాలయ్య, తదితరులు పాల్గొన్నారు.