Share News

Trains are delayed: ఆలస్యంగా రైళ్ల రాకపోకలు

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:17 PM

Passenger trains cancelled విజయనగరంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో.. జిల్లా మీదుగా పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి. వివిధ పాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్టు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే అధికారులు ప్రకటించారు.

Trains are delayed: ఆలస్యంగా రైళ్ల రాకపోకలు
పలాస రైల్వేస్టేషన్‌లో నిలిచిన వందేభారత్‌ రైలు..

విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్‌

వివిధ పాసింజర్‌ రైళ్లు రద్దు

పలాస/ఇచ్ఛాపురం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో.. జిల్లా మీదుగా పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి. వివిధ పాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్టు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో విజయనగరం రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాం దాటిన వెంటనే రైల్వేబ్రిడ్జి సమీపంలో నాగపూర్‌ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఐదు వ్యాగన్‌లు పట్టాలు తప్పగా, రెండు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మూడు వ్యాగన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రైల్వే విద్యుత్‌ లైనుతో పాటు ఆ గూడ్స్‌ ప్రయాణిస్తున్న ట్రాక్‌ దెబ్బతింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలాస రైల్వేస్టేషన్‌లో 20841 వందేభారత్‌ రైలును మూడు గంటలపాటు నిలిపేశారు. 12863 హౌరా-యశ్వంత్‌పూర్‌ నాలుగు గంటలపాటు నిలిచిపోయింది. బరంపూర్‌-విశాఖ పాసింజర్‌ రైలును పూర్తిగా రద్దు చేసారు. 18463 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, 18047 వాస్కోడిగామ, 22644 పాట్నా-యర్నాకులం, 18117 రాజారాణి, 12839 హౌరామెయిల్‌, 22819 ఇంటర్‌సిటీ, 17017 భువనేశ్వర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 3 నుంచి ఐదు గంటలపాటు ఆలస్యంగా వెళ్లాయి. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లోనూ ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. శుక్రవారం ఉదయం హౌరా నుంచి మద్రాస్‌ వెళ్లే రైలు ఉదయం 8.53 గంటలకు రావాల్సి ఉండగా, ఏడు గంటలపాటు ఆలస్యమైంది. మధ్యాహ్నం 3.23 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. అలాగే భువనేశ్వర్‌- హైదరాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 11.30గం.. లకు రావల్సి ఉండగా, 4.30 గంటలు ఆలస్యమైంది. సాయంత్రం 4గంటలకు వచ్చింది. ఉదయం 10గంటలకు, 10.30గంటలకు రావాల్సిన బరంపురం-విశాఖ, భువనేశ్వర్‌- విశాఖ ఇంటర్‌సీటీ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 29 , 2025 | 11:17 PM