Share News

Re-survey: రీసర్వే తెచ్చిన తంటా

ABN , Publish Date - May 03 , 2025 | 11:41 PM

Survey Issues వైసీపీ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రీసర్వే చేపడుతున్నట్టు వైసీపీ గొప్పలు చెప్పుకుంది. కానీ అధికారుల నిర్లక్ష్యమో, రీసర్వేలో లోపమో తెలియదు కానీ.. పొందూరు మండలం తాడివలసలో మ్యుటేషన్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Re-survey: రీసర్వే తెచ్చిన తంటా
తాడివలస సచివాలయం

  • తాడివలసలో మ్యుటేషన్లకు నోచుకోని 1,400 ఎకరాలు

  • జాయింట్‌ ఎల్‌పీ నంబర్లతో రైతులకు ఇబ్బందులు

  • పొందూరు, మే 3(ఆంద్రజ్యోతి): వైసీపీ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రీసర్వే చేపడుతున్నట్టు వైసీపీ గొప్పలు చెప్పుకుంది. కానీ అధికారుల నిర్లక్ష్యమో, రీసర్వేలో లోపమో తెలియదు కానీ.. పొందూరు మండలం తాడివలసలో మ్యుటేషన్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి సచివాలయానికి, తహసీల్దార్‌ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడివలస రెవెన్యూ గ్రామపరిధిలో తాడివలసతోపాటు లచ్చయ్యపేట, గండ్రేడు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో 2,500 మంది రైతులు 1,400 ఎకరాలు సాగు చేస్తున్నారు. రీసర్వే ముందు రైతులకు పట్టా, పాసుపుస్తకాల్లో ఉన్నవిధంగా మ్యుటేషన్లు జరిగేవి. 1-బి, అడంగళ్లు సైతం వచ్చేవి. దీంతో క్రయవిక్రయాలు సజావుగా జరిగేవి. రీసర్వే తర్వాత సర్వేనంబర్లలో సబ్‌డివిజన్‌లు తీసేసి జాయింట్‌ ఎల్‌పీ నెంబరు ఇచ్చారు. దీంతో రికార్డుల్లో ఒకరిభూమి ఇంకొకరిపేరు మీద నమోదైపోయింది. జాయింట్‌ ఎల్‌పీ నెంబర్ల కారణంగా మ్యుటేషన్లు జరుగక 1-బీ, అడంగళ్‌లు రావడంలేదు. దీంతో బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరానికి భూములు విక్రయించుకోలేకపోతున్నారు. మ్యుటేషన్లు జరుగక రిజిస్ట్రేషన్‌లు చేసుకోలేకపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

  • ఎన్నిసార్లు తిరిగినా.. అంతే

    రీసర్వే చేపట్టి.. ఏడాదైనా మా భూములకు మోక్షంలేదు. పాత సర్వేనంబర్లు ప్రకారం మ్యుటేషన్లు జరగడంలేదు. దీంతో వివిధ సర్వేనంబర్లలో నాకు 9 ఎకరాలు ఉన్నా 1-బీ, అడంగళ్‌ రావడంలేదు. తహసీల్దార్‌ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం కనిపించడం లేదు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి.

    - సీపాన విష్ణువర్ధనరావు, రైతు, తాడివలస

    ...............

  • పరిష్కారం మాచేతిలో లేదు

    తాడివలసలో భూ సమస్యలు ఉన్న విషయం వాస్తవమే. ఈ సమస్య పరిష్కారం మా చేతిలో లేదు. గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులోను ఈ సమస్యపైనే వినతులు వచ్చాయి. సమస్యను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

    - ఆర్‌.వెంకటేష్‌, తహసీల్దార్‌, పొందూరు

Updated Date - May 03 , 2025 | 11:41 PM