Share News

హా.. లక్ష్మీనరసింహా!

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:57 PM

Temple Property encroachment టెక్కలి పట్టణ నడిబొడ్డున ఉన్న పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో 6సీ కింద ఉంది. పాలక మండలి లేకపోవడంతో దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయి.

హా.. లక్ష్మీనరసింహా!
టెక్కలిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

  • ఆలయ భూములు అన్యాక్రాంతం

  • ఇతరుల ఆధీనంలో 100 ఎకరాలకుపైగా..

  • కౌలు చెల్లింపులు అంతంతమాత్రంగానే..

  • రూ.కోట్లలో ఆర్టీసీ బకాయిలు

  • శిథిలావస్థకు చేరుకున్న ఆలయం

  • టెక్కలి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): టెక్కలి పట్టణ నడిబొడ్డున ఉన్న పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో 6సీ కింద ఉంది. పాలక మండలి లేకపోవడంతో దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ ఆలయానికి నందిగాం మండల పరిధి కణితివూరులో 16ఎకరాలు, టెక్కలి మండలం రావివలస, వేములవాడలో 39ఎకరాలు, తొలుసూరుపల్లి, శ్యామసుందరాపురంలో 26.50ఎకరాలు, టెక్కలి, చింతలగారలో 40 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని సుమారు 300 మంది రైతులు సాగు చేస్తున్నారు. మరో 20 ఎకరాలను టెక్కలి డిగ్రీ కళాశాల మైదానానికి కేటాయించారు. ఈ భూముల్లో చాలా వరకూ అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సుమారు 150 ఎకరాల భూములు ఉన్న ఈ ఆలయానికి ఏటా రూ.3.09లక్షల ఆదాయం మాత్రమే రైతుల ద్వారా వస్తోంది. రైతుల నుంచి లక్షల రూపాయలు దేవదాయశాఖకు రావాల్సి ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు, రైతుల మొండివైఖరితో సంబంధిత ఈవోలు నోరు మెదపలేని దుస్థితి నెలకొంది.

  • రూ.కోట్లలో ఆర్టీసీ బకాయి..

  • లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పాత జాతీయ రహదారి వద్ద టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న 9.85ఎకరాలను 1987లో ఆర్టీసీకి ఇచ్చారు. గ్యారేజ్‌ నిర్మాణం పేరిట రూ.5లక్షలు దేవదాయశాఖకు చెల్లించి ఈ స్థలాన్ని ఆర్టీసీ యంత్రాంగం పొజిషన్‌లోకి తీసుకుంది. రూ.కోట్ల విలువ గల ఈ స్థలానికి ఆర్టీసీ యంత్రాంగం రూ.5లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో అప్పట్లో దేవస్థానం ఈవో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్టీసీ యంత్రాంగం కొన్నాళ్ల తరువాత రూ.50లక్షలు చెల్లించి మమ అనిపించింది. ఆలయానికి రావాల్సిన అసలు, వడ్డీ కలిపి ఆర్టీసీ రూ.20కోట్లకుపైగా బకాయి ఉంది. కాగా, ఆర్టీసీ రెండు విడతల్లో చెల్లించింది రూ.55లక్షలు మాత్రమేనని ఈవో మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా దేవస్థానం అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

  • ఆ ఆదాయమే దిక్కు..

  • ఆలయానికి ప్రస్తుతం రూ.24లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్వామివారికి, బ్యాంకు లాకర్లతో కలిపి వెండి ఏడు కేజీలు, సుమారు 800 గ్రాముల బంగారం ఉంది. నెలవారీ స్వామివారి భోగానికిగాను రూ.10వేలు, అర్చకుని జీతానికి రూ.15,600, భోగం వండే వంట మనిషికి రూ.7వేలు, స్వీపర్‌కు రూ.2,500, సెక్యూరిటీకి రూ.9వేలు, విద్యుత్‌ చార్జీలు కింద కొంత ఖర్చవుతోంది. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న 12 షాపుల ద్వారా నెలవారీ ఆదాయం వస్తుంది. దీంతో ఆలయ నిర్వహణ తాత్కాలికంగా గట్టెక్కుతోంది.

  • శిథిలావస్థకు..

  • దేవదాయశాఖ 6సీ పరిధిలో గల ఈ ఆలయాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కేవలం దాతల సహాయంతో ఆలయ నిర్వహణ సాగుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆలయ బేడా మండపం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడి ఇనుపచువ్వలు బయటకు వచ్చిప్రమాద భరితంగా మారింది. ధ్వజస్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. చినుకుపడితే చాలు ఆలయ ప్రధాన మండపంలో నీరు కారుతుంది. ఇప్పటికే రామమందిరం పూర్తిగా కూలిపోయింది. గతంలో దేవదాయశాఖ అధికారులు ఈ ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారే తప్ప పనులు మాత్రం చేపట్టలేదు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

  • సీజీఎఫ్‌ నిధులు రావాలి

  • ఆలయానికి సంబంధించిన 9.85 ఎకరాలను 1987లో ఆర్టీసీ తీసుకుంది. ఆ యాజమాన్యం నామమాత్రపు చెల్లింపులు చేసింది. కోట్ల రూపాయల బకాయి ఉంది. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. బేడామండపం, ధ్వజస్తంభం, ప్రధాన మండపం వంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. సీజీఎఫ్‌ నిధులు మంజూరైతే గానీ అభివృద్ధి చేయలేం.

    - వి.రాధాకృష్ణ, ఈవో, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, టెక్కలి

Updated Date - Dec 28 , 2025 | 11:57 PM