Share News

కార్మిక వైద్యం.. దైవాధీనం!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:30 AM

Services not available at ESI dispensary పైడిభీమవరంలోని ఈఎస్‌ఐ డిస్పెన్షరీ(కార్మిక బీమా వైద్యశాల)లో కార్మికులకు కనీస వైద్యం కరువవుతోంది. వివిధ పరిశ్రమల్లో ప్రతి కార్మికుడి జీతాల నుంచి ఈఎస్‌ఐ వైద్యం కోసం కొంత మొత్తం కోత విధిస్తున్నారు. కానీ అత్యవసర, అనారోగ్య సమయంలో కార్మికులకు వైద్యం ఇక్కడ అందని ద్రాక్షగా మారింది. దీంతో వేలాది మంది కార్మికులు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

కార్మిక వైద్యం.. దైవాధీనం!
పైడిభీమవరంలోని ఈఎస్‌ఐ డిస్పెన్షరీ..

  • పైడిభీమవరం ఈఎస్‌ఐ డిస్పెన్షరీలో అందని సేవలు

  • ఉన్నది ఒక్కరే డాక్టర్‌..

  • మరొకరు డిప్యూటేషన్‌పై రాకపోకలు

  • వైద్య పరీక్షలకు కిట్లు లేవు

  • అత్యవసరమైతే.. అంబులెన్సూ లేదు

  • రణస్థలం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరంలోని ఈఎస్‌ఐ డిస్పెన్షరీ(కార్మిక బీమా వైద్యశాల)లో కార్మికులకు కనీస వైద్యం కరువవుతోంది. వివిధ పరిశ్రమల్లో ప్రతి కార్మికుడి జీతాల నుంచి ఈఎస్‌ఐ వైద్యం కోసం కొంత మొత్తం కోత విధిస్తున్నారు. కానీ అత్యవసర, అనారోగ్య సమయంలో కార్మికులకు వైద్యం ఇక్కడ అందని ద్రాక్షగా మారింది. దీంతో వేలాది మంది కార్మికులు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో అతిపెద్ద పారిశ్రామికవాడగా పైడిభీమవరం పేరొందింది. ఆపై పలాస-కాశీబుగ్గలో జీడి పరిశ్రమలు వందలాది ఉన్నాయి. టెక్కలి, ఎచ్చెర్ల ప్రాంతంలో గ్రానైట్‌, చిప్స్‌ క్వారీలు ఉన్నాయి. వందలాది ధాన్యం మిల్లులు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలో కార్మికుల వైద్యం కోసం 2010లో పైడిభీమవరంలో ఈఎస్‌ఐ డిస్పెన్షరీ ఏర్పాటు చేశారు. ఈ డిస్పెన్షరీ పరిధిలో 23 వేలమంది కార్మికులు ఉన్నారు. అన్ని విభాగాలకు సంబంధించి వైద్యులు, అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్‌, మత్తు వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఆపై ఫార్మాసిస్ట్‌, స్టాప్‌నర్సులు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలి. కానీ డాక్టర్‌ ఒక్కరే ఉన్నారు. ఆయన కూడా ఏడాదిపాటు డిప్యూటేషన్‌పై కాకినాడలో విధులు నిర్వహించి ఈనెల 8న ఇక్కడ వైద్యుడిగా బాధ్యతలు చేపట్టారు. మరో డాక్టర్‌ గరివిడి డిస్పెన్షరీ నుంచి డిప్యూటేషన్‌పై ఇక్కడకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉన్నారు. కానీ వైద్య పరీక్షలకు అవసరమైన కిట్లు లేవు. అత్యవసర వైద్యం అందించే విభాగం లేదు. రోగులను తరలించేందుకు అంబులెన్స్‌ కూడా లేదు. ఈఎస్‌ఐ డిస్పెన్షరీకి సంబంధించి రూ.6కోట్లతో అత్యాధునిక భవనాలు నిర్మించారు. కానీ కనీసస్థాయిలో కూడా వైద్యసేవలు అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కార్మికశాఖ కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

  • జీడి కార్మికులకూ అదే పరిస్థితి

  • పలాస-కాశీబుగ్గలో జీడి కార్మికులు సైతం అత్యవసర సమయాల్లో వైద్యసేవలు పొందలేకపోతున్నారు. జీడి పరిశ్రమల్లో దాదాపు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో ఈఎస్‌ఐ పరిధిలో పాలీక్లీనిక్‌ ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగినా.. అనారోగ్యానికి గురైనా వెంటనే పాలీ క్లినిక్‌లో ప్రాథమిక వైద్యం అందించేవారు. తరువాత రణస్థలం, విశాఖ తరలించేవారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ నమోదు ప్రక్రియను చేపట్టారు. కానీ యాజమాన్యాలు అప్పట్లో కార్మికుల సంఖ్యను తక్కువ చేసి చూపించడంతో ఉన్న పాలీక్లినిక్‌ను సైతం ఎత్తేశారు. అప్పటి నుంచి జీడి కార్మికులకు వైద్యసేవలందడం లేదు.

  • జీతంలో ఈఎస్‌ఐ కోత..

  • కార్మికుడితోపాటు ఉద్యోగి హక్కు ఈఎస్‌ఐ. ఇది సామాజిక భద్రత పథకం. అనారోగ్యం, వైకల్యం, ప్రసూతి, పనిచేసే సమయంలో ప్రమాదాలు కారణంగా ఏర్పడే గాయాలు, మరణం వంటివాటి నుంచి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందిస్తుంది ఈ పథకం. పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తూ రూ.21వేలు కంటే తక్కువ జీతం ఉన్నవారు ఈఎస్‌ఐకి అర్హులు. ఈఎస్‌ఐ పథకం అమలు చేయడం యజమాని ముఖ్య బాధ్యత. ఉద్యోగి వేతనంలో యజమాని 3.25శాతం, ఉద్యోగి 0.75 శాతం భరించాల్సి ఉంటుంది. ఇలా కార్మిక శాఖకు జిల్లాలో కార్మికవర్గాల నుంచి ఏటా లక్షలాది రూపాయలు జమవుతోంది. అయితే చాలామంది యజమానులు తమ వద్ద పనిచేసేవారికి ఈ సదుపాయం కల్పించడం లేదు. ఈఎస్‌ఐ ఉన్నవారికి పైడిభీమవరం డిస్పెన్షరీలో వైద్యసదుపాయాలు దక్కడం లేదు. అన్నివిధాలా కార్మికులు దగాకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముంది. తమకు మెరుగైన వైద్యసేవలు అందించేలా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు.

  • దారుణం

  • జిల్లాలో పేరుకే ఈఎస్‌ఐ డిస్పెన్షరీ. చిన్నపాటి పీహెచ్‌సీలో ఉన్న వైద్యులు, సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడం దారుణం. అత్యాధునికంగా నిర్మించిన భవనాల్లో వైద్య పరీక్షలు చేసే కిట్లు లేవు. సరిపడా సిబ్బంది లేరు. దీంతో కార్మికులు ప్రైవేటు వైద్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి.

    - సీహెచ్‌ అమ్మన్నాయుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

  • బలోపేతం చేయాలి

  • 23వేల మంది కార్మికులకు వైద్యసేవలందించాల్సిన డిస్పెన్షరీలో ఒక వైద్యు డు ఉండడం అన్యాయం. ఏడాదిపాటు ఆ డాక్టర్‌ డిప్యూటేషన్‌పై కాకి నాడ వెళ్లారు. మరో డాక్టర్‌ డిప్యూటేషన్‌పై వారానికి మూడు రోజులు విధులు నిర్వ హించడం శోచనీయం. కార్మికచట్టాలను పటిష్టంగా అమలుచేసి డిస్పెన్షరీని మరింత బలోపేతం చేయాలి. కార్మికులకు మెరుగైన వైద్యసేవలందించాలి.

    - ముక్కు ఈశ్వరరావు, కార్మిక సంఘం నేత, పైడిభీమవరం

Updated Date - Dec 12 , 2025 | 12:30 AM