Share News

‘వంద’నాలమ్మా.. కొత్తమ్మతల్లీ

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:06 AM

Centenary celebrations from kothhamma భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే తల్లి.. కొటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్ర నలుమూలలు నుంచి ఒడిశా నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.

‘వంద’నాలమ్మా.. కొత్తమ్మతల్లీ
ఉత్సవాలకు ముస్తాబైన కొత్తమ్మతల్లి

రేపటి నుంచి శతాబ్ది ఉత్సవాలు

పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు

కోటబొమ్మాళి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే తల్లి.. కొటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్ర నలుమూలలు నుంచి ఒడిశా నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఉత్సవాలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది వందేళ్ల ఉత్సవం.. మరోవైపు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో.. ఆధ్యాత్మికశోభ మరింత ఉట్టి పడుతోంది. ఎక్కడ చూసినా విద్యుత్‌ కాంతులు ధగధగలాడుతున్నాయి. హెలిటూరిజంతోపాటు పౌరాణిక నాటకాలు, బుల్లితెర నటీనటులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితోపాటు టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, ఆలయ ఈవో వాకచర్ల రాఽధాకృష్ణ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో రాధాకృష్ణ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.

ఇదీ స్థల పురాణం :

1925 సంవత్సరంలో కొత్తమ్మ తల్లి జాతర ప్రారంభమైంది. అప్పట్లో కోటబొమ్మాళికి చెందిన కమ్మకట్టు చిన్నప్పలనాయుడురెడ్డి ఎడ్లబండిపై నారాయణవలస సంతకు వెళ్లి తిరిగొస్తుండగా.. రాత్రివేళ ఓ ముసలి ముత్తయిదువు బండిని ఆపింది. తాను నడవలేకపోతున్నానని చెప్పి.. ఆమె ఎడ్లబండి ఎక్కింది. తెల్లవారుజామున కోటబొమ్మాళి రాగానే.. బండి దిగి పట్నాయకుని వెంకటేశ్వరరావు తోటవైపు(ప్రస్తుతం కొత్తమ్మతల్లి ఆలయం ఉన్నచోటు) గజ్జల శబ్దంతో వెళ్లిపోయింది. ఇంటికి చేరుకున్న చిన్నప్పలరాజు రెడ్డి నిద్రకు ఉపక్రమించగా ఆ తల్లి కలలో కనిపించింది. ‘నీ ఎడ్లబండిలో వచ్చిన నేను కొత్తమ్మతల్లిని. పట్నాయకుని వెంకటేశ్వరరావు తోటలో కొలువుదీరుతాను. భక్తుల కోర్కెలు తీర్చుతాను. నాకు అక్కడ ఆలయాన్ని నిర్మించండి’ అని ఆమె కోరిందట. ప్రతి ఏటా పోలాల అమావాస్య (మహాలయ అమావాస్య) తర్వాత వచ్చే గురువారం నాడు మీ కుటుంబ సభ్యులతో నన్ను నీ ఇంట్లో పూజింజి.. ముర్రాటలతో ఆలయానికి వచ్చి కోళ్లు, మేకపోతులు బలిచ్చి జాతర చేయాలని చెప్పిందట. అప్పటి నుంచి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొత్తమ్మతల్లిపై భక్తుల్లో మరింత నమ్మకం పెరుగుతోంది.

భారీ ఏర్పాట్లు.. :

కొత్తమ్మతల్లి ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట జంక్షన్‌ నుంచి కోటబొమ్మాళి పెద్దచెరువు వరకు సమారు మూడు కిలోమీటర్లు పొడవునా, గ్రామ పురవీధుల్లో విద్యుత్‌ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు రూ.20, రూ.50లు ప్రత్యేక దర్శనాల కోసం ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాదం అందజేయనున్నారు. భోజనాలు పెట్టనున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 50వేల మంది భక్తులతో కొత్తపేట జంక్షన్‌ నుంచి కోటబొమ్మాళి పెద్దచెరువు వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి పురుషులు, మహిళలతో కబడ్డీ పోటీలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రావీణ్యం పొందిన సంగిడీ రాళ్లు, ఈడుపురాయి, ఉలవల బస్తాలు పోటీలు మంగళ, బుధవారాల్లో జరుగుతాయి. అలాగే పగటివేషాలు, కొయ్యి డ్యాన్సులు కూడా ఏర్టాటు చేశారు. మంగళ బుధవారాల్లో రాత్రి 10 గంటలకు ఢీ, జబర్దస్త్‌ నటీనటులతో ప్రదర్శనలు ఉంటాయి. గురువారం రాత్రి శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తారు.

ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 800 పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే 9440795835, 08942238633 నెంబర్లుకు ఫోన్‌ చేయాలని ఎస్‌ఐ వి.సత్యన్నారాయణ సూచించారు.

Updated Date - Sep 22 , 2025 | 12:06 AM