వైభవంగా కొత్తమ్మతల్లి ఉత్సవాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:10 AM
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ మేనేజర్ వాకచర్ల రాధాకృష్ణ, వేదపురోహితులు సుసరాపు గణపతిశర్మ, లక్ష్మీకాంతం శర్మలు పూర్ణకుంభం, వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అమ్మవారిని మంత్రులు రామ్మోహన్, అచ్చెన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోరాడ చిన్నగోవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

పట్టువస్త్రాలు తెస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు