కోల్‌కతా టు తమిళనాడు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:50 PM
Illegal trafficking of exotic parrots విదేశీ రామచిలుకల అక్రమ రవాణా గుట్టురట్టయింది. అరుదైన ఆస్ట్రేలియన్ ఫించెస్, కోన్సూర్ జాతికి చెందిన విదేశీ రామచిలుకలను కారులో కోల్‌కతా నుంచి తమిళనాడుకు తరలిస్తుండగా.. పలాసలో అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డాయి.
విదేశీ రామచిలుకలు అక్రమ రవాణా
లాడ్జి యజమాని ఫిర్యాదుతో గుట్టురట్టు
236 పక్షులు పట్టుకున్న అటవీసిబ్బంది
పలాస, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): విదేశీ రామచిలుకల అక్రమ రవాణా గుట్టురట్టయింది. అరుదైన ఆస్ట్రేలియన్ ఫించెస్, కోన్సూర్ జాతికి చెందిన విదేశీ రామచిలుకలను కారులో కోల్‌కతా నుంచి తమిళనాడుకు తరలిస్తుండగా.. పలాసలో అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డాయి. కోల్‌కతాకు చెందిన ఇద్దరి వ్యక్తుల వద్ద మొత్తం 236 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా (పశ్చిమబెంగ)కు చెందిన రోంటిదాస్, అమృత్‌గ్యాన్ అరుదైన ఆస్ట్రేలియన్ ఫించెస్, కోన్సూర్ జాతికి చెందిన విదేశీ రామచిలుకలను తమిళనాడు తరలిస్తున్నారు. వాటిని పంజరాల్లో బంధించి ఎవరికీ అనుమానం రాకుండా కారు వెనుకభాగంలోని డిక్కీలో పెట్టి రవాణా సాగిస్తున్నారు. సోమవారం రాత్రి పలాసలో నీలావతి రైల్వేగేటు వద్ద అమరావతి లాడ్జిలో బస చేశారు. పార్కింగ్ చేసిన కారులో నుంచి అర్ధరాత్రి సమయంలో పక్షుల కూతలు వినిపించాయి. లాడ్జి సిబ్బంది ఆ కారును పరిశీలించగా వందల సంఖ్యలో రామచిలుకలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం లాడ్జి యాజమాని.. అటవీ శాఖసిబ్బందికి ఈ సమాచారం అందించారు. మంగళవారం వేకువజామున కాశీబుగ్గ అటవీశాఖ అధికారి ఎ.మురళీకృష్ణనాయుడు, తన సిబ్బందితో కలిసి కారును పరిశీలించారు. అందులో 236 విదేశీ రామచిలుకలు కిక్కిరిసి ఉన్నట్టు గుర్తించారు. పక్షులను తరలిస్తున్న ఆ ఇద్దరినీ ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో వారిద్దరినీ, కారును అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. వారి రికార్డులు పరిశీలించగా రవాణాకు సంబంధించి ఎటువంటి పత్రాలు లభించలేదు. రూ.లక్షల విలువైన ఈ పక్షులను అక్రమ మార్గాన రాత్రివేళ వీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వణ్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం వారిపై కేసు నమోదు చేసి, పక్షులను విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సీవైఎల్‌డబ్ట్యూ అనుమతులు తప్పనిసరి:
మన రాష్ట్రంలో పక్షులు, జంతువులు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం గుండా తరలించడానికి చీఫ్‌వైల్డ్‌లైఫ్ వార్డెన్ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే అవి అక్రమ రవాణా కింద పరిగణించబడతాయి. ప్రస్తుతం తరలిస్తున్న ఆస్ట్రేలియాజాతికి చెందిన పక్షులు కూడా ఆ కోవలోకి వస్తాయి. వారికి మన రాష్ట్ర అనుమతులు ఏవీ లభించలేదు. ఇదిలా ఉండగా లాడ్జి సిబ్బంది ఫిర్యాదు చేయకపోతే పక్షులన్నీ ఆంధ్రా దాటి అమ్ముడుపోయేవని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ రహదారిపై, టోల్‌గేట్ల వద్ద అటవీశాఖ అధికారులు మరింత నిఘా పెంచాలని కోరుతున్నారు.