Arasavalli Temple: కమీషన్ కొట్టు.. బిల్లు పట్టు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:15 AM
Arasavalli Temple: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఓ రెగ్యులర్ ఉద్యోగి అంతాతానై వ్యవహరిస్తున్నాడు.

- ఆదిత్యాలయంలో ఓ రెగ్యులర్ ఉద్యోగి పనితీరుపై విమర్శలు
- నెలల తరబడి బీరువాల్లో అంటిపెట్టుకున్న బిల్లులు
- ప్రీ ఆడిట్ పేరుతో స్వీపర్ల జీతాలకూ అడ్డంకులు
అరసవల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఓ రెగ్యులర్ ఉద్యోగి అంతాతానై వ్యవహరిస్తున్నాడు. ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా అక్కడ సాగుతోంది. ఉద్యోగులకు జీతాలు, పనులకు బిల్లులు చెల్లించాలంటే ఆయనకు కమీషన్ ఇవ్వాల్సిందే. లేకుంటే రోజుల తరబడి ప్రీ ఆడిట్ అవ్వలేదనే సాకుతో ఆఫీసులోనే దస్త్రాలు ఉండిపోతాయి. ఆలయానికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నా స్వీపర్లకు జీతాలు కూడా చెల్లించని పరిస్థితి నెలకొంది. ఆ ఉద్యోగి పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కార్యాలయంలో అన్ని పనులు ఇంచుమించు ఆ ఉద్యోగి చేతుల మీదుగా జరుగుతుండడం, కంప్యూటర్ పరిజ్ఞానం వేరే రెగ్యులర్ ఉద్యోగులకు లేకపోవడంతో ఆయన ఆటలు సాగుతున్నాయి. ప్రసాదాల తయారీ, అన్నదానానికి అవసరమైన కూరగాయలు, ఇతర సరుకుల సరఫరాకు సంబంధించి గత ఏడాది జరిగిన వేలంలో కొందరు కాంట్రాక్టు దక్కించుకున్నారు. అయితే, ఈ సరుకులు సరఫరా చేసిన వారిలో కొందరికి ఇంకా బిల్లులు చెల్లించలేదు. ఇందుకోసం ఆ ఉద్యోగి కమీషన్ డిమాండ్ చేయగా, కాంట్రాక్టర్లు చెల్లించకపోవడంతో బిల్లుల కాగితాలు బీరువాలోనే మూలుగుతున్నాయి. పాత బకాయిలు చెల్లించకుండానే.. కొత్త టెండర్లు పిలవడం, వేలంపాట పూర్తయి, కొత్త కాంట్రాక్టర్లు సరుకులు సరఫరా చేయడం జరిగిపోతుంది. కానీ, పాత బిల్లులకు మాత్రం మోక్షం కలగడం లేదు.
ఆలయంలో అంతా దినసరి వేతన ఉద్యోగులు కావడం, రెగ్యులర్ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో ఆ ఉద్యోగి హవాకు ఎదరులేకుండా పోతుంది. ఈవో, సూపరింటెండెంట్ మాటను కూడా కొన్నిసార్లు వినే పరిస్థితి ఉండడం లేదని సాక్షాత్తూ ఆలయ ఉద్యోగులే వాపోతున్నారు. ‘నేను పర్మినెంట్ ఉద్యోగిని, నేను చెప్పినట్లు చేయాల్సిందే’ అంటూ దినసరి ఉద్యోగులు (13నెలలుగా వీరికి జీతాల్లేవు)పై జులుం చెలాయిస్తూ, ఆలయంలో అంతా తానై వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రస్తుతం ప్రోటోకాల్ దర్శనాలకు సంబంధించిన తాళాలు కూడా ఆ ఉద్యోగి చేతిలోనే ఉన్నాయి. ఈ మధ్యనే జరిగిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మనవరాలి తలనీలాలు ఆదిత్యాలయ కార్యాలయంలోనే తీయించిన ఘటనలో తాళాలు ఆ ఉద్యోగి ద్వారానే బయటకు వచ్చాయన్నది జగమెరిగిన సత్యం. అలాగే తప్పుకు దొరకకుండా నకిలీ బిల్లులు రాయడంలో ఆ ఉద్యోగిది అందెవేసిన చేయి అని ఆలయ వర్గాలే అంటున్నాయి. రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి పాసుల ప్రింటింగ్, టిక్కెట్ల అమ్మకాలు, ఆఫీసుకు రాకుండా పోయిన ఒక దినసరి ఉద్యోగి సహకారంతో ఫోన్ ద్వారానే లక్షలాది రూపాయల అవినీతికి తెరలేపారని, ఆ ఉద్యోగి నోటి దురుసుతనానికి ఆలయంలో ప్రస్తుతం ఎదరులేకుండా పోయిందని అంటున్నారు. ప్రత్యేకించి రూ.100 టిక్కెట్ల విక్రయాల్లో నేటికీ అవినీతి జరుగుతుంది. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి పరిస్థితులను చక్కదిద్దాలని భక్తులు కోరుతున్నారు.