Share News

చేతబడి అనుమానంతో చంపేశారు

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:17 AM

మండలంలోని కేశుపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఉంగ రాములు(80) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.

చేతబడి అనుమానంతో చంపేశారు
రాములు(ఫైల్‌)

కేశుపురంలో వృద్ధుడి దారుణ హత్య

కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా దాడిచేసి..

దారుణానికి ఒడిగట్టింది సమీప బంధువులే

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

పలాస/పలాసరూరల్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని కేశుపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఉంగ రాములు(80) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో సొంత కుటుంబీకులే ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేసి హతమార్చారు. ప్రత్యక్ష సాక్షులు, కాశీబుగ్గ పోలీసుల వివరాల ప్రకారం.. కేశుపురం గ్రామంలో ఏడాదిలో ఇద్దరు మృతి చెందారు. ఇదే క్రమంలో ఆ గ్రామానికి చెందిన అంబలి తులసీరావు అనే వ్యక్తి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆయన అనారోగ్యానికి, గ్రామంలో ఇద్దరి చావుకు ఉంగ రాములే కారణమని తులసీరావు కుటుంబ సభ్యులు భావించారు. ఎన్ని మందులు వినియోగించినా తులసీరావు ఆరోగ్యం కుదుటపడకపోవడంతో సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి ఓ దాసుడి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. దీంతో మంగళవారం రాత్రి 8 గంటలకు తులసీరావు ఇంటికి దాసుడు వచ్చి రెండు గంటలపాటు తాంత్రిక పూజలు నిర్వహించాడు. గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు చేతబడి చేయడం కారణంగానే తులసీరావుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పాడు. దీంతో తులసీరావు కుటుంబీకులంతా వృద్ధుడైన రాములపై అనుమానం పెంచుకున్నారు. పూజలు చేసిన తరువాత దాసుడు తిరుగు ప్రయాణమయ్యాడు. అనంతరం ఒక పథకం ప్రకారం రాత్రి 11-12 గంటల సమయంలో తులసీరావుతో పాటు గ్రామానికి చెందిన అంబలి చంద్రయ్య, సారిపతి రాజ్‌కుమార్‌, బుడ్డ తేజేశ్వరరావు, బుడ్డ లక్ష్మీకాంత్‌, అంబలి రాశి, కోనారి సూర్యనారాయణ, అంబలి భీమారావు కర్రలు, రాళ్లు చేతపట్టుకొని రాములు ఇంటికి చేరుకున్నారు. నిద్రపోతున్న రాములును ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి వారంతా కర్రలతో దాడి చేశారు. ఆయన కింద పడిపోగానే ముఖంపై రాయితో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాములు భార్య అమ్మన్నమ్మ పక్షవాతంతో బాధపడుతుండడంతో కళ్లెదుటే తన భర్తను హతమార్చుతున్నా కేకలు వేయడం తప్ప ఆమె నిలువరించలేక అక్కడే కుప్పకూలిపోయింది. రాములు, అమ్మన్నమ్మకు కుమారుడు ఉమాపతి, ముగ్గురు కుమార్తెలు ఉంగ అన్నపూర్ణ, అంబటి సరసమ్మ, ఇందిర ఉన్నారు. కుమారుడు ఉమాపతి విశాఖపట్నంలో కూలి పనులు చేసుకుంటున్నాడు. కుమార్తెలు గ్రామంలోనే ఉంటున్నారు. విషయం తెలుసుకొని వారంతా ఇంటికి చేరుకునే సరికి హత్యచేసిన వారంతా పరారయ్యారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు, సీఐ పి.సూర్యనారాయణ బుధవారం వేకువజామున పరిశీలించారు. మృతుడి భార్య అమ్మన్నమ్మను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హత్యకు వినియోగించిన కర్రలు, రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. చేతబడి అనుమానంతో ఈ హత్య చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో చిల్లంగి అని ప్రచారం చేసి అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దాసుడు వచ్చాడంటే ఘర్షణలే..

కేశుపురంలో ఒక సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. వీరంతా మూఢనమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని ఆ వర్గానికి చెందిన వారే చెబుతున్నారు. చిన్న జ్వరం వచ్చినా బోరుభద్రకు దాసుడుని తీసుకువచ్చి పూజలు చేయిస్తుంటారు. ఆయన ఎప్పుడు వచ్చి వెళ్లినా గ్రామంలో చిన్నచిన్న ఘర్షణలు జరుగుతుంటాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాములు క్షుద్ర పూజలు చేస్తూ అందరికీ చేతబడులు చేస్తుంటాడని గ్రామానికి చెందిన కొంతమందిలో అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో తులసీరావు అనారోగ్యానికి గురికావడానికి చేతబడే కారణమని భావించి ఆయన కుటుంబీకులు రాములును చంపేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది రాములు రక్తసంబంధీకులే కావడం విశేషం.

Updated Date - Sep 04 , 2025 | 12:17 AM